సినిమా ఇండస్ట్రీ అనేది క్రియేటివ్ ఫీల్డ్.. ఇక్కడ కథ మొదలుకుని సన్నివేశాలు, పాటలు, నేపథ్య సంగీతం.. డైలాగులు, టైటిల్స్, పోస్టర్లు, వాటి డిజైన్స్.. ఇలా రకరకాల క్రాఫ్ట్స్‌కి సంబంధించి కాపీ ఆరోపణలు రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఒక్క తెలుగు అనే కాదు కానీ ఇతర పరిశ్రమల్లోనూ ఇలాంటి సంఘటనలు జరగడం పలుసార్లు చూశాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమాలోని ఓ పాట గురించి నెట్టింట రచ్చ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్..
మీ హీరో మూవీలో 20 ఏళ్ల క్రితమే కాపీ సాంగ్ వాడేసి.. బిల్డప్ ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?.. కాస్త ఆలస్యం అయినా కానీ నిజం నిప్పులాంటిది.. దాగదు.. దహించేస్తుంది.. అని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తారక్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అసలేం జరిగిందో వివరంగా చూద్దాం.. ఇటీవల విదేశీ యువకులు ‘ఆది’ మూవీలోని ‘చికి చికి భం భం’ అనే పాటలోని సంగీతాన్ని బీర్ బాటిల్స్‌తో ఊదుతూ పలికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమ హీరోకి, ఆయన పాటలకు అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేశారు. కట్ చేస్తే.. వాళ్లు పాడింది ఒరిజినల్ సాంగ్.. మణిశర్మ కాపీ కొట్టి ‘ఆది’ సినిమాలో పెట్టాడంటూ.. ఒరిజినల్ సాంగ్ యూట్యూబ్ లింక్ పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆది’ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ చార్ట్ బస్టర్ ఆల్బమ్, గూస్ బంప్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘చికి చికి భం భం’ అనే ఫస్ట్ సాంగ్‌కి పోతుల రవి కిరణ్ లిరిక్స్ రాయగా.. టిప్పు పాడారు.
అయితే ఇది 1999 సమయంలో రూపొందిన టర్కీష్ సాంగ్ అని.. దాన్ని యాజిటీజ్ ట్యూన్‌తో సహా లేపేశారని ఒరిజినల్ పాట లింక్ షేర్ చేస్తూ.. తారక్ అభిమానులను ఉడికిస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్. దీని గురించి పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తుంటే.. బుంగమూతి పెట్టుకుని.. ‘మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొడితే మా హీరోని అంటారేంటి?’ అంటూ చిన్నబుచ్చుకుంటున్నారు..