ప్రిన్స్ & నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థ్రిల్లింగ్ డ్రామా “కలి”. ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. శివ శేషు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
Kali Review
కథ: మంచోడిగా బ్రతకడం కష్టం అని డిసైడ్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు శివరామ్ (ప్రిన్స్). శివరాం ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపేందుకు కలి (నరేష్ అగస్త్య) రంగంలోకి దిగుతాడు. శివరామ్ సమస్యలేమిటి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకంటున్నాడు? దాన్ని కలి ఎలా ఆపాడు అనేది “కలి” కథాంశం.
నటీనటుల పనితీరు: నరేష్ అగస్త్య ప్రతి సినిమాతోనూ తన సత్తాను ఘనంగా చాటుకుంటూనే ఉన్నాడు. అతడు పాత్రను ఓన్ చేసుకునే తీరు, చాలా షార్ప్ గా కళ్ళతో హావభావాలు పలికించే విధానం, అన్నిటికీ మించి ఇంటెన్సిటీతో చెప్పే డైలాగులు నరేష్ అగస్త్య ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. మంచి పాత్ర & సినిమా పడితే స్టార్ యాక్టర్ గా ఎదిగే అవకాశం ఉంది.
ప్రిన్స్ లుక్ చూస్తేనే ఈ సినిమా చాలా పాతది అని అర్థమైపోతుంది. నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. నరేష్ ముందు తేలిపోయాడు.
మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: రమణ జాగర్లమూడి సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ ఏకైక టెక్నికాలిటీ. నరేష్ అగస్త్య & ప్రిన్స్ కి మధ్య జరిగే సంభాషణలకు పెట్టిన ఫ్రేమ్స్ భలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నరేష్ అగస్త్య హావభావాలను తెరపై చూపించిన కెమెరా యాంగిల్స్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి.
జీవన్ బాబు (జె.బి) బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ప్రతి ఎమోషన్ & ట్విస్ట్ ను చాలా చక్కగా ఎలివేట్ చేశాడు.
దర్శకుడు శివ శేషు ఒక సింపుల్ స్టోరీని కొత్తగా డీల్ చేయడానికి ప్రయత్నించాడు. పాయింట్ గా చెప్పడానికి మంచిదే అయినప్పటికీ.. విజువల్ గా అలరించలేకపోయింది. గంటన్నర సినిమాలో కూడా అనవసరంగా పాట ఇరికించి సాగదీసాడు దర్శకుడు. ప్రిన్స్ క్యారెక్టర్ కు ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేసి, కలితో ఆడే ఆటను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా నడిపి ఉంటే సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించేది.
విశ్లేషణ: పాయింట్ గా బాగున్న సినిమాలు, ప్రెజెంట్ చేసే తీరు ముఖ్యం. ఆ ప్రెజంటేషన్ ఒక్కోసారి బడ్జెట్ ఇష్యూస్ వల్ల పాడైతే, ఒక్కోసారి సీన్ కంపోజీషన్ సరిగా లేక వర్కవుట్ అవ్వవు. “కలి” విషయంలో ఈ రెండూ జరిగాయి. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి బడ్జెట్ ఇష్యూస్ రాగా.. సీన్ కంపోజ్ చేసిన విధానం సరిగా లేక కొన్ని మంచి సీన్స్ వృధా అయిపోయాయి. ఓవరాల్ గా ఒక మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది “కలి”.
ఫోకస్ పాయింట్: కంటెంట్ తోపాటు క్వాలిటీ కూడా ఉండాలి “కలి”.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus