సినిమా విజయాన్ని కొలవడానికి కొలమానాలు ఏమన్నా ఉన్నాయా అంటే… ఠక్కున చెప్పే మాట వసూళ్లు. అయితే కోట్ల రూపాయలు పెట్టి తీసే సినిమాలు ఇచ్చే వసూళ్ల కంటే… తక్కువ బడ్జెట్ సినిమాలు సాధించే విజయం కూడా గొప్పదే అంటున్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఇండియన్ సినిమాలో ప్రయోగం అంటే ఓ నాలుగు అడుగులు ముందుండే హీరోల్లో కమల్ హాసన్ ఒకరు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆయన సినిమాల్లో ప్రయోగాలే ఉన్నాయి.
అలా అని వందల కోట్ల రూపాయలు అందించే సినిమాలు ఆయన చేయడం లేదా? అంటే ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే ఆయన ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు, ఆ నటుల గురించి ఏమో అనేలా చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆయన ఓ సందర్భంలో చేసిన కామెంట్సే. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న ‘బిగ్ బాస్’ షోలో ఓ సంద్భంలో వందల కోట్లు వసూలు చేసే సినిమాలే కాదు… చిన్న సినిమాలూ అవసరమే అనే యాంగిల్‌లో మాట్లాడారు.
‘‘రూ.500 కోట్లు, రూ.600 కోట్లు సాధించే సినిమాల కన్నా ప్రేక్షకులు మంచి చిత్రం గురించి ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారు’’ అని కామెంట్ చేశారు కమల్. అంతేకాదు అలాంటి సినిమాలే రావాలని అందరూ కోరుకోవాలి అని పిలుపునిచ్చారు. మనం హోటల్‌లో ఆర్డరు ఇచ్చే మెనూలోనే అన్ని రకాలూ ఉండేలా చూసుకుంటాం. అలాంటిది వినోదం విషయంలో అలా ఎందుకు ఆలోచించం. ఒకే తరహా చిత్రాలు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంటూ మరో ప్రశ్న వేశారాయన.
తాను (Kamal Haasan) ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యమిస్తానని, ఎందుకంటే చిత్రపరిశ్రమకు తానొక పెద్ద అభిమానిని అని చెప్పారు. స్పెషల్ ఎఫెక్ట్‌లు ఎక్కువగా ఉన్న సినిమాలే ఇండస్ట్రీని నిలబెట్టవు. చిన్న బడ్జెట్ చిత్రాలు లేకుండా పరిశ్రమ మనుగడ సాధించలేదు అని గుర్తు చేసే ప్రయత్నం చేశారు కమల్. కొత్త దర్శకులు, కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఇండస్ట్రీలోకి రావాలి. ఎందుకంటే సినీ పరిశ్రమ ఎప్పుడూ సూపర్ స్టార్లు, అగ్ర దర్శకుల మీదే ఆధారపడి ఉండదు అని పరిశ్రమ పరిస్థితి గురించి వివరించారు.