ఒక సినిమాకి 2 ఇంటర్వెల్సా? వినడానికే విడ్డూరంగా అనిపిస్తుంది కదూ.! నాన్ స్టాప్ గా ఓ సినిమాని రెండున్నర గంటల పాటు చూడటం కష్టం. అందుకే అందరూ ఇంటర్వెల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చాలామంది ఇంటర్వెల్లో స్నాక్స్ కొనుక్కుని అవి తింటూ సినిమా చూడటానికి ఇష్టపడతారు. దాని కోసం ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? అని చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక సినిమాకి రెండు ఇంటర్వెల్స్ అంటే.. ‘రెండో ఇంటర్వెల్ కి భోజనం చేయాలేమో’ అనిపించొచ్చు.
Kamal Haasan, Rajinikanth
సరే ఒక సినిమాకి 2 ఇంటర్వెల్స్ అనే ఆలోచన.. ఏ ఫిలిం మేకర్..కి అయినా వచ్చిందా? అంటే అవును వచ్చింది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సినిమాకి..! షాక్ అయ్యారా? పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో రజినీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ (K. S. Ravikumar) దర్శకత్వంలో ‘నరసింహ’ (Narasimha) (తమిళంలో ‘పడియప్పా’) అనే సినిమా వచ్చింది. సౌందర్య (Soundarya) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ (Ramya Krishnan) విలన్ గా నటించారు.
రజినీకాంత్ కి ధీటుగా ఆమె నటించి అందరికీ షాకిచ్చింది. ఈ సినిమా 1999 లో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మొదట ఈ సినిమా రన్ టైం 3 గంటల 30 నిమిషాలు వచ్చిందట. దీంతో 2 ఇంటెర్వల్స్ ఉంటే బెటర్ అని రజినీకాంత్ సూచించారట. అయితే ఎందుకైనా మంచిదని టీం.. ముందుగా కమల్ హాసన్ కి సినిమా చూపించారట.
అప్పుడు ఆయన చూసి కొన్ని అనవసరమైన సన్నివేశాలు చెప్పి.. వాటిని డిలీట్ చేయమని సలహా ఇచ్చారట. దీంతో ఫైనల్ రన్ టైం 3 గంటల 1 నిమిషం వచ్చిందట. దీంతో రెండు ఇంటర్వెల్స్ అనే ఆలోచనని టీం విరమించుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.