మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ తెరకెక్కించిన తాజా చిత్రం “ఒప్పం”. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సొంతం చేసుకొంది. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో “కనుపాప” అనే టైటిల్ తో విడుదల చేశారు. మోహన్ లాల్ అంధుడిగా నటించిన ఈ చిత్రంలో విమలారామన్ కథానాయికగా నటించింది. ఈ సమీక్ష మీకోసం..!!
కథ : వైజాగ్ లోని ఒక అపార్ట్ మెంట్ లో వాచ్ మ్యాన్ కు సహాయకుడిగా పనిచేస్తుంటాడు జయరాం (మోహన్ లాల్). అదే అపార్ట్ మెంట్ లో పనిమనిషిగా పనిచేసే దేవయాని (విమలారామన్) భర్త నుండి విడిపోయి.. జయరాం కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటుంది. తన చెల్లెలి పెళ్లి కోసం కష్టపడి డబ్బు కూడబెడుతుంటాడు జయరాం. అప్పటివరకూ అంతా బానే సాగుతుందనుకొంటున్న తరుణంలో.. ఆ అపార్ట్ మెంట్ లో ఉండే రిటైర్డ్ జడ్జ్ కృష్ణమూర్తిని ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య కేసులో జయరాం ఇరుక్కుంటాడు. అసలు జయరాంకు జడ్జ్ కృష్ణమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? కృష్ణమూర్తిని హత్య చేసింది ఎవరు? ఆ కేసులో జయరాంను ఎందుకు ఇరికించాలని ప్రయత్నిస్తారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం!
నటీనటుల పనితీరు : మోహన్ లాల్ ను “కంప్లీట్ యాక్టర్” అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. అంధుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంతో.. ఎన్నో ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించాడు. ఇక పోలీసులు కొట్టే సీన్ లో మోహన్ లాల్ ను చూసిన ప్రేక్షకుడి కన్ను చెమర్చకమానదు. డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ సముద్రఖని ఈ చిత్రంలో విలన్ గా ప్రశంసార్హమైన నటనతో ఆకట్టుకొన్నాడు. సైకో విలన్ గా అతడి నటన సినిమాకి ప్లస్ అయ్యింది. విమలారామన్ ది చెప్పుకోదగ్గ పాత్ర కాకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధిమేరకు అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు : రోన్ ఎతన్ యోహాన్ సంగీతం వినసోంపుగా ఉంది. నేపధ్య సంగీతంతో కథలోని ఇంటెన్సిటీని చక్కగా ఎలివేట్ చేశాడు. ఎన్.కె.ఏకాంబరం కేరళ, ఊటీ అందాలను తన కెమెరాలో బంధించి.. తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. లాంగ్ షాట్స్, డ్రోన్ షాట్స్ కంటికింపుగా ఉన్నాయి. తెలుగులో అనువదించేప్పుడు డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది.
దర్శకుడు ప్రియదర్శన్ ఎంచుకొన్న కథ రెగ్యులర్ దే అయినా.. కథనాన్ని నడిపించిన విధానం ప్రేక్షకుడ్ని అలరిస్తుంది. ఫస్టాఫ్ లో వరుసబెట్టి వచ్చే పాటలే కాస్త విసుగు తెప్పిస్తాయి. అయితే.. ఒక్కసారి అసలు కథ మొదలవ్వాగానే ఎక్కడా ల్యాగ్ లేకుండా ఆకట్టుకొన్నాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. అయితే.. హీరో అంధుడిగా చేసే విన్యాసాలే కాస్త “అతి” అనిపిస్తాయి.
విశ్లేషణ : ఫక్తు కమర్షియల్ సినిమాకు బాగా అలవాటుపడిపోయిన ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చునేమో కానీ.. సహజత్వాన్ని కోరుకొనే ప్రేక్షకులకు మాత్రం విశేషంగా నచ్చే చిత్రం “కనుపాప”. ఫస్టాఫ్ లో వచ్చే ల్యాగ్ ను కాస్త భరించగలిగితే.. సెకండాఫ్ లో సస్పెన్స్ డ్రామాను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు!