2019లో కన్నడలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం “కావలుదారు”. ఆ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో “కాపటధారి”గా రీమేక్ చేశారు. తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ కథానాయకుడిగా నటించగా జనవరి 28న విడుదలైందీ చిత్రం. తెలుగు సుమంత్ హీరోగా తెరకెక్కి నేడు (ఫిబ్రవరి 18) విడుదలైంది. కన్నడ వెర్షన్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. మరి తెలుగు వెర్షన్ సంగతి ఏమిటి అనేది చూద్దాం..!!
కథ: గౌతమ్ (సుమంత్ కుమార్) హైద్రాబాద్ లో ట్రాఫిక్ డి.ఎస్.ఐ. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యింది పోలీస్ అవ్వడం కోసమే అయినప్పటికీ.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఎలాగైనా క్రైమ్ డిపార్ట్మెంట్ కి మారాలి అని తపిస్తున్న గౌతమ్ కి మెట్రో పిల్లర్ కింద దొరికిన ముగ్గురు మనుషుల ఎముకల గూడు అటెన్షన్ గ్రబ్ చేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్య-భర్త-కుమార్తెలు అలా ఎందుకు మరణించాల్సి వచ్చింది? అనే మిస్టరీని చేధించాలి అనుకుంటాడు గౌతమ్. అందుకు తన డిపార్ట్మెంట్ స్నేహితులతోపాటు రిటైర్డ్ సీనియర్ పోలీస్ (నాజర్) సహాయం కూడా తీసుకుంటాడు.
ఇంతకీ దొరికిన ఆ ఎముకలు ఎవరివి? ఆ కుటుంబం ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఆ రహస్యాన్ని గౌతమ్ ఎలా కనుగొన్నాడు? అనేది “కపటధారి” కథాంశం.
నటీనటుల పనితీరు: సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేయడంలో సిద్ధహస్తుడైన సుమంత్ ఈ చిత్రంలో ఒక సిన్సియర్ పోలీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఒక సగటు పోలీస్ కి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ ను కూడా అలవరుచుకొని పాత్రకు ప్రాణం పోసాడు సుమంత్. అతడి పాత్రలో కానీ, నటనలో కానీ ఎక్కడా అతి అనేది కనిపించదు. సుమంత్ ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ చిత్రం.
చాన్నాళ్ల తర్వాత నాజర్ ను ఓ అర్ధవంతమైన పాత్రలో చూశాం. ఈమధ్యకాలంలో గెస్ట్ రోల్స్ కి పరిమితమైపోయిన నాజర్ ఈ చిత్రంలో కథా గమనానికి ఉపయోగపడే పాత్రలో ఆకట్టుకున్నారు. తమిళ నటుడు జయప్రకాష్, నందితశ్వేతలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సైమన్ కె.కింగ్ నేపధ్య సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్. ఈ సినిమా ఒక నియోనాయిర్ థ్రిల్లర్ అని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు. ట్యూస్స్ ఎక్కడా రిపీటెడ్ అనిపించలేదు. ఉన్న రెండు పాటలను కూడా మోంటేజ్ సాంగ్స్ గా తీయడం సినిమాకి మరో ప్లస్ గా నిలిచింది.
కన్నడ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ హేమంత్ రావు సమకూర్చిన కథ-కథనం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా కేస్ డీటెయిల్స్ ను హీరో పరిశీలించే సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. నిజానికి కన్నడలో హిట్ అవ్వడానికి రీజన్ ఈ సరికొత్త సీన్ కాంపొజీషనే.
తెలుగు-తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయిపోయాడు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ గా “కపటధారి” మంచి సినిమానే. అయితే.. కన్నడ వెర్షన్ లో దొర్లిన తప్పులను తెలుగు వెర్షన్ లోనూ రిపీట్ చేయడం అనేది మైనస్ అని చెప్పాలి. సినిమాటిక్ లిబర్టీ తీసుకొన్నప్పుడు అది లాజికల్ గా లేకపోయినా పర్వాలేదు, కనీసం యాక్సెప్టబుల్ గా ఉండాలి. సినిమాకి ప్రధాన బలమైన క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కనీస స్థాయి మార్పులు చేస్తే బాగుండేది. దాంతో తెలుగు వెర్షన్ లోనూ హేమంత్ రావు కనిపిస్తున్నాడే కానీ.. ప్రదీప్ కృష్ణమూర్తి మార్క్ ఎక్కడా కనిపించలేదు.
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, డి.ఐ బాగున్నాయి. అయితే.. కన్నడ వెర్షన్ లోని చాలా సన్నివేశాలను తెలుగులోనూ వాడేసి, తమిళ-తెలుగు వెర్షన్ లను ఒకేసారి షూట్ చేశారు కాబట్టి ఎక్కువగా తమిళ ఆర్టిస్ట్స్ ఉండడంతో.. రీజనల్ ఫీల్ అనేది మిస్ అయ్యింది. అందువల్ల కొన్ని పాత్రలకు ప్రేక్షకులు సరిగా కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ కన్నడ వెర్షన్ చూడకపోయినా కూడా ఆ మొహాలు మనవి కావని స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ ఎపిసోడ్స్ కూడా కాస్త తెలిసిన మొహాలతో షూట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే కథలో కీలకమైనవే ఆ మొహాలు కాబట్టి.
విశ్లేషణ: స్లో అండ్ స్టడీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు “కపటధారి” మంచి టైంపాస్ సినిమా. ఊహించని ట్విస్తులు, సెన్సిబిలిటీస్ ఉన్న పాత్రలు, ఆకట్టుకొనే క్లైమాక్స్, సుమంత్ సెటిల్డ్ నటన ఇలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాలో.. సినిమాటిక్ లిబర్టీస్ అనేవి కాస్త ఎక్కువగా ఉండడమే మైనస్. సొ, డిఫరెంట్ సినిమాల కోసం పరితపించే ప్రేక్షకులు తప్పకుండా చూడొచ్చు.