రమ్యకృష్ణ గురించి వార్తలొస్తుంటాయి, కృష్ణవంశీ గురించీ వార్తలొస్తుంటాయి. అయితే ఇద్దరి గురించి కలసి వార్తలు, సమాచారం రావడం చాలా తక్కువ. ‘రంగమార్తాండ’ సినిమా పుణ్యమా అని ఇప్పుడు ఇద్దరి గురించి వార్తలు రాసే అవకాశం మాకు, చదివే అవకాశం మీకు వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగమార్తాండ’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర గురించి, ఆమెతో చిత్రీకరణ గురించి కృష్ణవంశీ ఇటీవల మాట్లాడుతున్నారు. అలాగే మాతృకకు, ఈ సినిమాకు చేసిన మార్పులు కూడా చెప్పారు.
70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ సినిమా చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకు, ఇక్కడి నేటివిటలీ అనుగుణంగా మార్చి ఈ సినిమా చేశాం అని కృష్ణ వంశీ తెలిపారు. మరాఠీలో ‘నటసామ్రాట్’ కథ ఎక్కువగా షేక్‌స్పియర్ నాటకాల చుట్టూ సాగుతుంది. అయితే ఇక్కడకు వచ్చేసరికి మన నాటకాలకి అన్వయిస్తూ స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాం అని చెప్పారు కృష్ణవంశీ. రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుల్ని పరిశీలించారట.
ఈ క్రమంలో రమ్యకృష్ణ కూడా కొంతమంది పేర్లు సూచించారట. కానీ ఆమెనే ఫైనల్ అయ్యారని కృష్ణవంశీ చెప్పారు. ప్రతి సినిమాలోనూ పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంటావెందుకని నేను, మా అబ్బాయి రమ్యకృష్ణని అడుగుతుంటాం అని చెప్పిన కృష్ణవంశీ ఈ సినిమాలో ఆమెది కళ్లతోనే భావాలు పలికించే పాత్ర అని చెప్పారు. ఆమె కళ్లు బాగుంటాయని, ఈ పాత్రకు ఆమె సూట్ అవుతుందని భావించి ఆయన అడిగారట. కృష్ణ వంశీ అడగ్గానే..
రమ్యకృష్ణ ఒప్పుకోవడంతోపాటు, ఆ పాత్రకి మేకప్, హెయిర్‌స్టైల్ లాంటివి ఆమె చూసుకున్నారట. క్లైమాక్స్‌లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నప్పుడు కంట్లో నీళ్లొచ్చేశాని ఆయన తెలిపారు. దాదాపు 36 గంటలపాటు ఆ సీన్స్ తీశామని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాకు ప్రివ్యూల నుండి మంచి టాక్ వస్తోంది. అసలు సంగతి తేలాలంటే మార్చి 22 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ‘రంగమార్తాండ’ థియేటర్లలోకి వస్తుంది.