సీనియర్ దర్శకుడు కృష్ణవంశీకి (Krishna Vamsi), మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాలని అనుకున్నారు. దాదాపు స్టార్ట్ అవుతుంది అని అనుకున్న సమయంలో సినిమా ఆగిపోయింది. మరో సినిమాను చేద్దామనుకున్నా ఆ సినిమా కుదర్లేదు. అయితే కృష్ణవంశీతో రామ్‌చరణ్ (Ram Charan) ఓ సినిమా చేశాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కృష్ణవంశీ సినిమాలకు చిరంజీవి ఏదో విధంగా సాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా చెప్పడం వెనుక కారణం..
Krishna Vamsi
రీసెంట్‌గా కృష్ణవంశీ ఓ నెటిజన్‌కి ఇచ్చిన ఆన్సర్లే. ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉండే కృష్ణవంశీని ఒక అభిమాని ‘శ్రీ ఆంజనేయం’ (Sri Anjaneyam) సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు. ఆ సినిమాలో హీరోగా తొలుత ఎన్టీఆర్ అని అనుకున్నారట కదా అని అడిగితే దానికి కృష్ణవంశీ రియాక్ట్ అవుతూ తాను తొలుత అనుకున్నది చిరంజీవిని అని చెప్పారు. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని రాసిన సినిమా అదని, కానీ దురదృష్టవశాత్తు జరగలేదని చెప్పారు.
ఎందుకు అవ్వలేదు అని చూస్తే.. ఆ సినిమాకు కొన్నేళ్ల ముందు అంటే 2001లో ‘శ్రీ మంజునాథ’ అనే సినిమా చేశారు చిరంజీవి. ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో మరోసారి దేవుడు నేపథ్యంలో సినిమా చేయాలని చిరంజీవి అనుకోలేదట. అలా ‘శ్రీ ఆంజనేయం’ మిస్ అయింది అని అప్పట్లో చెప్పేవారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేసుకుని, ప్రేమకథను యాడ్ చేసి నితిన్‌తో సినిమా చేశారు.
ఇదిలా ఉండగా చిరంజీవి – కృష్ణవంశీ గతంలో అనుకున్న ‘వందేమాతరం’ సినిమా చేద్దాం అని అనుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది అని అప్పుడు చెప్పారు. అయితే సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాదేమో అని అప్పుడు నిర్మాతలు ముందుకు రాలేదని అంటుంటారు. దీంతో అది కాస్తా కథ ఆలోచన దగ్గరే ఆగిపోయింది. ఈ విషయాలు గుర్తు చేసుకుంటున్న అభిమానులు ‘ఆ సినిమాలు చేసుంటే బాగుండేది బాస్’ అని అంటున్నారు. ఏం చేస్తాం అన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా.