నటుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో ఆర్య ఒకరు. పదహారు సంవత్సరాల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆర్య ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా సక్సెస్ సాధించారు. స్కూల్, కాలేజ్ లో టాపర్ అయిన ఆర్య కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి క్యాంపస్ ప్లేస్ మెంట్ ద్వారా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.
ఆ తర్వాత యూఎస్ కు వెళ్లి అక్కడ జాబ్ చేయాలని ఆర్య భావించగా 9/11 ఘటనతో అమెరికా ఆంక్షలు విధించడం వల్ల ఆ ప్రయత్నాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చేస్తున్న ఐటీ జాబ్ కాంట్రాక్ట్ పూర్తి కావడంతో ఆర్య మోడలింగ్ పై దృష్టి పెట్టారు. కెరీర్ తొలినాళ్లలో సరిగ్గా నటించడం రాక డైరెక్టర్ జీవా చేత తిట్లు తిన్నానని ఆర్య అన్నారు. తొలుత ఇబ్బందులు ఎదురైనా ఆర్య నటించిన మూడు సినిమాలు వరుసగా సక్సెస్ సాధించాయి. బాల డైరెక్షన్ లో తెరకెక్కిన నేను దేవుణ్ణి సినిమా తనను పూర్తిగా మార్చేసిందని ఆర్య అన్నారు.
నేనే అంబానీ, రాజారాణి సినిమాలతో తనకు తెలుగులో కూడా అభిమానులు ఏర్పడ్డారని ఆర్య చెప్పారు. 2018 తర్వాత తను నటించిన సినిమాలు హిట్ కాలేదని ఆ సమయంలో సార్పట్ట సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని ఆర్య చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు సహ నిర్మాతగా పని చేసిన షణ్ముగం సినిమా రిలీజ్ కు వారం ముందు చనిపోయారని ఆ ఘటనతో తాను చాలా బాధ పడ్డానని చిన్నపిల్లాడిలా ఏడ్చేశానని ఆర్య చెప్పుకొచ్చారు.