కొద్ది రోజుల క్రితం పాండమిక్ కారణంగా వాయిదా పడ్డ సినిమాల రిలీజ్ డేట్స్ వరుస పెట్టి అనౌన్స్ చేసి హంగామా చేశారు మేకర్స్.. ఈ 2023 సంక్రాంతికి కూడా విడుదల కాబోయే సినిమాల హడావిడి చూసి.. సినిమాలు సరే.. థియేటర్ల పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యపోయేలా చేశారు కానీ చివరి నిమిషంలో కొన్ని చిత్రాలు తప్పుకోక తప్పలేదు.. సంక్రాంతి సీజన్ పెద్ద హీరోలతోనే సరిపోయింది.. ఫిబ్రవరిలో కొన్ని మూవీస్ వదిలారు.. మరీ అంత కాకపోయినా ఓ మోస్తరుగా ఆడుతున్నాయి..
తర్వాత ఆగస్టు నెలలోనూ క్రేజీ ఫిలింస్ రాబోతున్నాయి.. విచిత్రం ఏంటంటే.. అదే నెలలో దగ్గర దగ్గర 4 నుంచి 5 సినిమాలు సందడి చెయ్యబోతున్నాయి.. అది కూడా ఒకే రోజు ఖర్చీఫ్ వేసుకోవడం విశేషం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. SSMB 28.. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.. 11వ తేదీ అని టాక్.. తర్వాత అదే తేదీకి మెగాస్టార్ చిరంజీవి, మోహర్ రమేష్ కాంబోలో..
‘వేదాళం’ రీమేక్‌గా రూపొందుతున్న ‘భోళా శంకర్’ కూడా రాబోతుందని ప్రచారం జరిగింది.. అప్పటికి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్.. ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేస్తున్న ‘జైలర్’ కూడా ఆగస్టు 11నే వస్తాడు అంటున్నారు.. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి క్రేజీ స్టార్స్ కూడా యాడ్ అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు..
ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న బయోపిక్ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతుందంటూ కన్ఫమ్ చేసేశారు.. ఇక అదే రోజున సందీప్ రెడ్డి వంగా సెకండ్ బాలీవుడ్ ఫిలిం.. రణ్ బీర్ కపూర్ ‘యానిమల్’ కూడా విడుదల కానుందని బీటౌన్ టాక్.. ఈ లెక్కన ఒకే రోజు ఐదు భారీ చిత్రాలు రాబోతున్నాయి అనే న్యూస్ గురించి ఫిలిం వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి..