‘స్పిరిట్’ సినిమా చాలా నెలలు ఆగిన తర్వాత మొన్నీమధ్య అప్‌డేట్స్ రావడం మొదలయ్యాయి. తొలుత ఓ ఆడియో టీజర్, తర్వాత ప్రీలుక్ లాంటి ఫస్ట్ లుక్ వచ్చాయి. ఇక ఇప్పటికి చాలు సినిమా షూటింగ్ సగం అయ్యాక రిలీజ్ డేట్ చెబుతారేమో అని అనుకున్నారు రెబల్ ఫ్యాన్స్. అయితే అనూహ్యంగా సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా సమయంలో పవన్, దర్శకుడు సుజీత్ ప్లాన్ చేసినట్లు ప్లాన్ చేశారు.
పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. అంటే సుమారు 14 నెలల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది. దీని కోసం ఇంత ముందుగా సినిమా డేట్ ప్రకటించి డేట్ లాక్ చేసుకోవాలా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన లెక్క వినిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 25న ‘ఓజీ’ సినిమా విడుదల సమయంలో చేసిన ప్లానింగ్ లాంటిదే ఇప్పుడూ జరుగుతోంది అనిపిస్తోంది.

ఎందుకంటే వచ్చే ఏడాది 6 మహాశివరాత్రి, 7న ఆదివారం వస్తున్నాయి. ఇక మార్చి 10న రంజాన్ సెలవు కాగా, 13, 14 తేదీల్లో మళ్లీ వీకెండ్ రానుంది. ఆ తర్వాత హోలీ, గుడ్ ఫ్రైడే కూడా వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సినిమాను మార్చి 5న రిలీజ్ చేస్తున్నారు అని సినిమా వర్గాల అంచనా. ఇంత లాంగ్ వీకెండ్స్ రావడం అంటే.. సినిమా వసూళ్లు పరుగులు పెట్టడానికి మంచి రోజులు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇప్పటివరకూ తెరపై ఎవరూ చూపించని విధంగా ప్రభాస్‌ను సందీప్ వంగా చూపించబోతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారి అయినా రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి వస్తుందట. అక్కడ జైలర్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌కీ, ప్రభాస్‌కీ మధ్య సంభాషణే ఆ మధ్య సౌండ్ టీజర్‌గా వచ్చింది. అలాగే ఈ సినిమాలో పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా చూపించబోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
