దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాంచరణ్ లు లీడ్ రోల్స్ లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ప్రపంచస్థాయి ఆస్కార్ అవార్డు వరకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా అనేక వేదికలపై ఆయన ప్రదర్శనలు చూసాం ఇప్పటివరకు. అయితే అలాంటిదే మరొక అరుదైన అవకాశాన్ని పొందారు కీరవాణి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ‘X’ వేదికగా ఈ విధంగా పంచుకున్నారు.
M.M.Keeravani
“ప్రియమైన అందరికీ, వందే మాతరం, ప్రఖ్యాత గీతం ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతాన్ని స్వరపరచే అవకాశం లభించడం నాకు ఎంతో గౌరవంగా, గర్వంగా అనిపిస్తోంది. ఈ విశాలమైన కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 2,500 మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. మన దేశ ఆత్మగౌరవం, ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకను మనమంతా కలిసి ఘనంగా జరుపుకుందాం, వందే మాతరం” అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు కీరవాణి.
ఇక వందేమాతరం గీతం విషయానికొస్తే, 1887 లో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరచిన ఈ గీతం, భారతీయులు బ్రిటిష్ నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలబడటానికి కావాల్సిన దైర్యం ఇవ్వటంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇది కేవలం పాట కాదు..దేశం కోసం పోరాడినవారి లక్షల గుండెల నినాదం. 150 ఏళ్లుగా వందే మాతరం, ప్రతి భారతీయుడి హృదయంలో నిత్యం రీ-రిలీజ్ అవుతున్న దేశభక్తి క్లాసిక్.