‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి డీసెంట్ హిట్లతో తెలుగులో కూడా ఓ మోస్తరు మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. ఆ తర్వాత తెలుగు డైరెక్టర్ తో ‘ప్రిన్స్’ అనే సినిమా కూడా చేశాడు. అది పెద్దగా ఆడలేదు కానీ డీసెంట్ ఓపెనింగ్స్ ను అయితే రాబట్టింది. ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఇక్కడి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మహావీరుడు’ ని ‘ఏషియన్ సంస్థ’ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా పై కొంత బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా బాగానే ఉన్నాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం రండి :
కథ : సత్య (శివ కార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. అతను స్వతహాగా పిరికివాడు. కానీ, ‘మహావీరుడు’ పేరుతో కొన్ని కామిక్స్ చేస్తుంటాడు. ప్రజలను ఓ వీరుడు వచ్చి రక్షిస్తే ఎలా ఉంటుందో అలాంటి కథలు చెబుతుంటాడు. అయితే అతను పైకి చూసినప్పుడు మాత్రం పవర్ ఫుల్ గా మారిపోతాడు. అది ఎందుకు? తర్వాత ఊహించని విధంగా పొలిటికల్ లీడర్స్ కు ఇతను టార్గెట్ అవుతాడు? దానికి కారణం ఏంటి? ప్రజలకి కూడా రాజకీయ నాయకుల వల్ల కష్టాలు వచ్చి పడతాయి.
వాళ్ళని రక్షించే బాధ్యత కూడా హీరో పై పడుతుంది.? వీటికి కారణం ఏంటి? ఈ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాబట్టి సినిమా చూసే తెలుసుకోవాలి.
నటీనటుల పనితీరు : శివకార్తికేయన్ మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఓ పక్క పిరికివాడిగా కనిపించి కామెడీ చేస్తాడు. మరో పక్క ధైర్యవంతుడిగా మారిపోయి ఫైట్స్ చేస్తాడు. ఇలాంటి క్యారెక్టర్లు శివ కార్తికేయన్ కి బాగా సెట్ అవుతాయి. కాబట్టి అతను ఈజ్ తో చేసేశాడు.అతని తర్వాత రవితేజ వాయిస్ ఓవర్ గురించి చెప్పుకోవాలి. అతని వాయిస్ ఓవర్ మనకి మర్యాద రామన్న రోజులను గుర్తు చేస్తుంది. అలాగే ఇందులో సునీల్ కూడా నటించాడు.
పెద్దగా నిడివి లేని ఈ పాత్రకి తన వంతు న్యాయం చేశాడు.హీరోయిన్ అదితి శంకర్ పాత్ర కూడా చిన్నదే. కానీ ఉన్నంతలో ఆమె కూడా బాగానే చేసింది. సరిత, మిస్కిన్, తమ పాత్రలకు న్యాయం చేశారు. యోగి బాబు మరోసారి తన మార్క్ కామెడీతో నవ్వించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు : మడోన్ అశ్విన్ అందరికీ రీచ్ అయ్యే కథను ఎంపిక చేసుకున్నాడు.అందరినీ కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంది. కానీ… కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్న ఫీలింగ్ అడుగడుగునా కనిపిస్తుంది. హీరో పిరికివాడు అని చెప్పడానికి ఎక్కువ సీన్లు పట్టాయి. అటు తర్వాత కూడా సాగదీత ఉంది. రైటరే దర్శకుడైతే వచ్చే సమస్యలని మడోన్ అశ్విన్ మరోసారి చాటి చెప్పినట్టైంది.
భరత్ శంకర్ నేపధ్య సంగీతం ఓకే.పాటలైతే పెద్దగా గుర్తుండవు. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అరుణ్ విశ్వ నిర్మాణ విలువలకి ఢోకా లేదు. ఫైట్స్ కూడా బాగున్నాయి.
విశ్లేషణ : శివ కార్తికేయన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ (Mahaveerudu) మూవీ ఇది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి అనే కంప్లైంట్ ఉంది కానీ వాటిని కామెడీతో కవర్ చేసేశాడు దర్శకుడు. ఈ వీకెండ్ కి థియేటర్ కి వెళ్లి నవ్వుకోవాలి అంటే ‘మహావీరుడు’ మంచి ఆప్షన్ అని చెప్పాలి.