తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయిన సందర్భాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించారు. ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రెండూ కూడా మాస్ సినిమాలే. పండగ సీజన్ కి తగ్గ సినిమాలు ఇవి. అయితే ఇప్పుడు ఈ సినిమాలకు ఓ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలను మైత్రి సంస్థ సొంతంగా రిలీజ్ చేయాలనుకుంటుంది. దీనికోసం నైజాంలో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. అక్కడ వరకు ఒకే.. కానీ ఏపీలో మాత్రం ఓ సమస్య వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి గతేడాది చివర్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రిలీజయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. భారీ వసూళ్లను రాబట్టింది. అయితే కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులు తిరిగి రాలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అలానే ఈ ఏడాది విడుదలైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ విషయంలో కూడా అలానే జరిగిందట. ఈ రెండు సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు జరిగిన డిస్కషన్స్ లో.. తమ బ్యానర్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాల విషయంలో అడ్జస్ట్ చేసేలా మాటలు కుదిరాయట.
ఇప్పుడు ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల రిలీజ్ దగ్గర పడుతుండడంతో ‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’ బాకీల గురించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు సినిమాల డీల్స్ ఫైనల్ కాలేదని టాక్. మరిప్పుడు ఈ బాకీలను ఫైనల్ చేసి రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి!