స్టార్ హీరోగా, బెస్ట్ ఫాదర్‌గా… తనకంటూ ఓ స్థాయిని సృష్టించుకున్నారు సూపర్ స్టార్ మహేష్‌బాబు. వీటికితోడు ఇతర వ్యాపారాల్లోనూ వచ్చి అదిరిపోయే వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన వ్యాపారాల్లో మల్టీప్లెక్స్ ఒకటి. ఇప్పటికే ఏఎంబీ అంటూ హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్ థియేటర్లను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తన వ్యాపారాన్ని సౌత్‌లో మిగిలిన రాష్ట్రాలకు విస్తరింపజేసే పనిలో ఉన్నాడు. వ్యాపార రంగంలో తన తొలి అడుగు హైదరాబాద్‌లో ‘ఏఎంబీ’ రూపంలో వేసిన మహేష్… రెండో అడుగును కర్ణాటకలో వేస్తున్నాడని టాక్.
టాలీవుడ్ హీరోలకు చెందిన అతి పెద్ద మల్టీప్లెక్స్ అంటే… మొన్నీమధ్య వరకు (Mahesh Babu) మహేష్‌బాబు థియేటర్లు ఏఎంబీ అని చెప్పేవాళ్లు. అయితే ఇటీవల అమీర్ పేటలో ఏఏఏ సినిమాస్ అని పెట్టాడు. దీనికి మంచి స్పందన వస్తోంది. దీంతో మహేష్ నెక్స్ట్ ఆలోచన ఏంటి, ఇంకెక్కడ ఏంఎబీ పెడతాడు అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దానికి సమాధానం కర్ణాటక అని అంటున్నారు. బెంగళూరులో కొత్త ఏంఎబీ పెట్టే ప్లాన్‌లో ఉన్నారు.
మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ సునీల్ నారంగ్‌తో కలిసి ‘ఏఎంబీ’ మల్టీప్లెక్స్‌ను రూపొందించారు. ఇప్పుడు ఘనవిజయం అందుకుంటున్నారు. త్వరలో ఈ ఇద్దరు కలిసి బెంగుళూరులో భారీ మల్టీప్లెక్స్‌ను లాంచ్ చేయబోతున్నారు. అక్కడ ఓ చరిత్ర ఉన్న థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారట. బెంగుళూరులో 50 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ‘కపాలి’ సినిమా థియేటర్ స్థానంలో ఏఎంబీ వస్తుందట. నిజానికి మూడేళ్ల క్రితమే కపాలిని కూల్చేయడం గమనార్హం.
బెంగుళూరులోని గాంధీనగర్ ఏరియాలో ఏఎంబీ ఉండబోతోంది అని బ్యానర్ బట్టి అర్థమవుతోంది. కపాలి థియేటర్‌లో కన్నడ చిత్రాలే కాదు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఆడేవి. శివరాజ్‌కుమార్, ఉపేంద్ర నటించిన ‘ఓం’ సినిమాను 30సార్లు ఈ థియేటర్‌లో రిలీజ్ చేశారట. చివరగా 2017లో ‘హులిరాయ’ అనే సినిమా ఈ థియేటర్‌లో చివరి సినిమా. మరి కొత్త థియేటర్‌లో ఏ సినిమా సినిమాతో సందడి ప్రారంభం అవుతుందో చూడాలి.