ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనుషుల ఉద్యోగాలు పోతాయి అంటూ ఓవైపు భయం పెరుగుతుంటే.. మరోవైపు సినిమా జనాలు దానిని తెగ వాడేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు అంతగా వాడటం లేదు కానీ.. ఆ పని అయితే మొదలైంది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మామూలుగా లేదు. ఇప్పటికే దివంగత నటుల్ని, వారి గొంతును సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో ఏఐ హవా మామూలుగా లేదు.
Kanguva
అయితే ఇప్పుడు వీటన్నింటికి మించిన విషయం ఒకటి జరిగింది. ఇది వర్కవుట్ అయ్యి.. సినిమాకు మంచి విజయం దక్కితే ఇక పాన్ ఇండియా సినిమాలు తీయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని భాషల్లో సినిమా తీసినా.. నటులు ఒక్కసారి డబ్బింగ్ చెబితే సరిపోతుంది. అదేంటి ఇప్పుడూ ఒక్కసారే డబ్బింగ్ చెబుతున్నారు కదా అనుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి ఒక భాషలో చెబితే అన్ని భాషలకూ డబ్బింగ్ అయిపోతుంది.
అవును, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ‘కంగువ’ (Kanguva) సినిమా టీమ్ సూర్య పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తోందట. ‘కంగువ’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ సూర్య గొంతే వినిపించనుందట. ఆయన తమిళంలో డబ్బింగ్ చెబితే.. ఏఐ ద్వారా ఇతర భాషలకు ట్రాన్స్‌లేట్ చేసి ఆ భాషల్లో పెట్టేస్తారట. ఇలా చేస్తే చాలా సమయం, డబ్బు, మానవ వనరులు కలిసొస్తాయి కదా. అదీ మేటర్.
ఇక శివ దర్శకత్వం వహించిన ‘కంగువ’ (Kanguva) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని రజనీకాంత్ ‘వేట్టయన్’ వల్ల వాయిదా వేశారు. తాజాగా నవంబరు 14ను రిలీజ్ డేట్ అనుకుంటున్నారు. 2డీ, త్రీడీ, ఐమ్యాక్స్ వెర్షన్లలో వెర్షన్లలో సినిమా రానుంది. అయితే ఈ విషయంలో స్పష్టత లేదు. ఇక ఈ సినిమాతో ఏకంగా రూ. 2000 కోట్లు సంపాదిస్తామని నిర్మాత జ్ఞానవేల్ అంటున్నారు. అంతలా సినిమా మీద నమ్మకం పెట్టేసుకున్నారాయన.