కొన్ని రోజుల క్రితం అనుకుంటా.. ‘మన శంకర్ వరప్రసాద్’గారు సినిమా నుండి వరుస ప్రచార చిత్రాలు వస్తున్నప్పుడు ఓ మాట బాగా వినిపించింది. ఈ సినిమా కథ ఇలా ఉంటుందని కొన్ని పాత సినిమాల పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడారు కొందరు. అప్పుడు ఆ విషయం చూశాక.. నిజమేనా? నమ్మాలా అనిపించింది అందరికీ. అయితే అనిల్ రావిపూడి మరీ పాత సినిమాల్ని కలిపేసి ఓ సినిమా కథ రాసుకొని ఉంటారా? అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ చూశాక అప్పుడు వచ్చిన పుకార్లే నిజమేమో అనిపిస్తోంది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లకు.. కచ్చితంగా ఓ మూడు సినిమాల పేర్లు స్ఫురణకు వస్తాయి. అవే ‘డాడీ’, ‘బాడీగార్డ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూడు సినిమాలను ఇప్పటికే చూసినవాళ్లకు కచ్చితంగా ఆ పాయింట్ తడుతోంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్‌లో కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పేశారు. నిజానికి ఇప్పటికే ఆ పాయింట్లు పాటతో చెప్పేశారు. శంకర వరప్రసాద్ – శశిరేఖ మాజీ భార్యాభర్తలని.. ఏదో కారణం వల్ల విడిపోయారు అని.

ఇప్పుడు ట్రైలర్‌తో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. విడిపోయిన తర్వాత ఆమె కుటుంబానికి ఏదో ఇబ్బంది కలిగితే ఆ పని హీరోకి దక్కుతుంది. ఏంటా సమస్య, హీరోనే ఎందుకు వెళ్లాడు.. వెళ్లాక మాజీ భార్య కుటుంబం ఎలా స్పందించింది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. విడిపోవడం ‘డాడీ’ సినిమా నుండి తీసుకోగా.. రక్షణ కోసం రావడం ‘బాడీగార్డ్’లో ఉందనిపిస్తోంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో కథలో కీలక ముగింపు సంక్రాంతి దగ్గర్లో ఉండబోతోంది.
ఇదేంటి సినిమా కథను ఇంత సింపుల్‌గా తేల్చేశారా? అనుకుంటున్నారా? ట్రైలర్ చూశాక అనిపించిన విషయాలివీ. మరి అనిల్ రావిపూడి మనకు చూపించిన సీన్ల వెనుక, మధ్యలో ఇంకేమైనా ట్విస్టులు పెట్టి ఉంటే చెప్పలేం. చూద్దాం ఈ సంగతేంటో తెలియాలి అంటే జనవరి 12 రావాల్సిందే. ‘శంకర వరప్రసాద్ గారు’ కూడా రావాల్సిందే.
