సెకండ్ లాక్ డౌన్ టైంలో మారుతి రాసి-తీసిన సినిమా “మంచి రోజులొచ్చాయి”. సంతోష్ శోభన్-మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మారుతి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (నవంబర్ 4) దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ దీపావళి టపాసు సరిగా పేలిందో లేదో చూద్దాం..!!
కథ: అతి భయం కలిగిన గోపాల్ తిరుమలశెట్టి (అజయ్ ఘోష్). ప్రతి చిన్న విషయానికి భయపడడం అతనికి పరిపాటు. ఆ భయం అనే ఎమోషన్ తో ఆడుకుంటుంటారు సంతోష్ (సంతోష్ శోభన్) & పద్మ (మెహరీన్). ఆ ఆట ఒకానొక సందర్భంలో తారా స్థాయికి చేరుకొని.. సంతోష్-పద్మల ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఆ అతి భయాన్ని సంతోష్ ఎలా మ్యానేజ్ చేశాడు? పద్మను ఎలా పెళ్లాడాడు? అనేది “మంచి రోజులొచ్చాయి” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్లు సంతోష్, మెహరీన్ ల కంటే తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్టాడు. అతడి భయం, ఆ భయం వల్ల పుట్టే కామెడీకి జనాలు పగలబడి నవ్వడం ఖాయం. ఇంకా చెప్పాలంటే అజయ్ ఈ చిత్రానికి హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంతోష్ శోభన్ డైలాగ్ డెలివరీ బాగుంది. నటుడిగానూ కొన్ని సన్నివేశాల్లో పరిణితి ప్రదర్శించాడు. ఇక బక్కచిక్కిన మెహరీన్ అందంతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ కూడా నవ్విస్తాడు. శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష చెముడు, సుదర్శన్, సప్తగిరి, సత్యం రాజేష్, ప్రవీణ్ లు అలరిస్తారు.
సాంకేతికవర్గం పనితీరు: అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతం సన్నివేశాల్లోని హాస్యాన్ని బాగా ఎలివేట్ చేసింది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ డిజైన్ ను ఎలివేట్ చేయడంలో ఈ ఇద్దరూ తమ పాత్రను పూర్తిస్థాయిలో పోషించాయి. క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేసే ల్యాగ్స్ ను కాస్త క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ రాబట్టగలిగారు. ముఖ్యంగా సెకండ్ లాక్ డౌన్ టైంలో ఇంతమంది నటీనటులతో చిత్రాన్ని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ముగించడం అనేది మామూలు విషయం కాదు, అందుకు నిర్మాణ సారధులను మెచ్చుకోవాలి.
ఇక డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే.. తొలుత ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేద్దామనుకున్న మారుతి, తర్వాత దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి మారుతి సినిమాలాగే ఈ సినిమాలోనూ కథ లేదు. కథనం కూడా సోసోగా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో మాత్రం అనవసరమైన ల్యాగ్ కాస్త ఎక్కువైంది. దాదాపు ఓ అరగంట సినిమా అవసరమా అనిపిస్తుంది. అలాగే.. క్లైమాక్స్ ను మరీ ఆదరబాదరాగా చుట్టేశాడు. కోమా ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేసినా సినిమాకి పెద్ద నష్టం ఉండదు. ఇక కథను ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ లో కుదిరినన్ని క్యారెక్టర్స్ ను ఇరికించేయడం అనేది సింక్ అవ్వలేదు. సో, దర్శకుడిగా మారుతి తన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: లాజిక్కులు గట్రా పట్టించుకోకుండా, ఏ పాత్ర ఎప్పుడు, ఎందుకొస్తుందో అనే విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా కాస్త లేకిగా ఉన్నా.. కామెడీని ఎంజాయ్ చేయగలిగితే “మంచి రోజులు వచ్చాయి” చిత్రాన్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. లేదంటే మాత్రం కాస్త బోర్ ఫీలవుతారు. టైమ్ పాస్ కోసం మాత్రం ఒకసారి హ్యాపీగా చూసేయదగిన చిత్రమిది.