ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన సినిమా పెద్దల భేటీకి… ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు హాజరు కాలేదు. ఎందుకు రాలేదు, చిరంజీవితో ఉన్న టామ్ అండ్ జెర్రీ స్టయిల్ సమస్యనే కారణమా అంటూ చాలామంది చాలా రకాలుగా అంచనాలు, లెక్కలు, చర్చలు వేసుకున్నారు. ఇంతలో మోహన్‌బాబును పిలవలేదు అనే మాట బయటకొచ్చింది. అయితే ఇప్పుడు మరో విషయం చెప్పుకొచ్చారు మోహన్‌బాబు తనయుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు. తన తండ్రికి రావాల్సిన ఆహ్వానాన్ని ఎవరో రాకుండా చేశారట.
ఏపీ సీఎం పంపిన ఆహ్వానాన్ని ఎవరు ఆపేస్తారు? అసలు అది సాధ్యమేనా? గత రెండు రోజులుగా ఇదే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో తనకు ఆహ్వానం అందిందని, కానీ వెళ్లను అని చెప్పానని మరో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఇప్పుడే కాదు, ఇకపై కూడా ఏపీ సీఎం జగన్‌ను కలిసేది లేదని స్పష్టం చేశారు. ఈ మాటతో విష్ణు చెప్పిన మాటపై చిన్న డౌటానుమానం కలుగుతోంది. బాలకృష్ణేమో చిరంజీవి బృందం నుండి ఆహ్వానం అందింది అంటున్నారు. విష్ణు ఏమో ఏపీ సీఎం జగన్ నుండి వచ్చిన ఆహ్వానం అందలేదు అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం – సినిమా ఇండస్ట్రీ భేటీకి అసలు ఆహ్వానాలు ఇచ్చింది ఎవరు? వాటిని సంబంధిత వ్యక్తులకు పంపింది ఎవరు? వస్తున్నారో లేదో అనే విషయం కనుక్కున్నది ఎవరు అనేది ఇక్కడ అర్థం కావడం లేదు. సమావేశం నాడు చిరంజీవి బేగంపేట ఎయిర్‌పోర్టు దగ్గర మాట్లాడుతూ… ‘నాకు ఆహ్వానం వచ్చింది కాబట్టి వెళ్తున్నా. నాతోపాటు ఇంకెవరెవరు వస్తున్నారో తెలియదు’ అని అన్నారు. కానీ ఆ తర్వాత అందరూ ఒకే ఫ్లైట్‌లో వెళ్లారు. కాబట్టి ఎవరెవరు వస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేకే చిరంజీవి అలా తప్పించుకున్నారు అనుకోవచ్చు.
ఇదేది లేఖల కాలం కాదు, పావురాల ద్వారా సమాచారం అందించే కాలం అంతకంటే కాదు. అయితే మెయిల్ లేదంటే ఫోన్ కాల్ ద్వారా ఆహ్వానాలు వస్తాయి. ఏపీ ప్రభుత్వం నుండి సినిమా పెద్దలకు ఈ మధ్య అలానే ఆహ్వానాలు వచ్చాయి. అలాంటప్పుడు మోహన్‌బాబు రావాల్సిన ఆహ్వానాన్ని ఎవరు అడ్డుకుంటారు. అది కూడా వైఎస్ జగన్‌కు తెలియకుండా ఆపగలరా. ఒకవేళ అదే జరిగి ఉంటే… ఆయన సమావేశం నాడు వాకబు చేసే ఉంటారు. మరోవైపు ఫ్లైట్‌లో వెళ్లిన సినిమా పెద్దలతో సంబంధం లేకుండా అలీ, పోసాని కృష్ణమురళి, దర్శకుడ మహి. వి. రాఘవ్, ఆర్.నారాయణమూర్తి వెళ్లారు. మోహన్‌బాబు అలా అయినా పిలిచేవారు కదా.
సో మోహన్‌బాబుకు సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం పంపారా? పంపితే ఎవరు పంపారు? ఒకవేళ చిరంజీవి టీమ్ నుండే ఆహ్వానాలు వెళ్లి ఉంటే ఆ మాట విష్ణు చెప్పాలి కదా. బాలయ్య అయితే ఇదే మాట అన్నారు. సో ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది మళ్లీ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణునే.