సినీ పరిశ్రమలో ఎన్ని విజయాలు సాధించినా.. ఒక్క ఫ్లాప్ పడిందంటే చాలు.. కెరీర్ నెమ్మదిస్తుంది. కానీ మెహ్రీన్ కి వరుసగా అపజయాలు పలకరిస్తున్నప్పటికీ.. కెరీర్ పరుగులు పెడుతూనే ఉంది. నాని “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెహ్రీన్… తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది. ఇక తిరుగుండదు అని అనుకొనేలోపే సాయి ధరమ్ తేజ్ తో చేసిన జవాన్ మూవీ బోల్తా కొట్టింది. దాని తర్వాత సందీప్ కిషన్ తో తమిళంలో చేసిన కేరాఫ్ సూర్య దెబ్బకొట్టింది. గోపిచంద్ తో చేసిన పంతంతో నైనా హిట్ ట్రాక్ లోకి వద్దామనుకుంటే ఆ ఫలితం రివర్స్ అయింది. ఇలా మూడు ఫ్లాప్స్ ఉంటే ఆ హీరోయిన్ ని సంప్రదించడానికి దర్శకనిర్మాతలు బయపడుతారు.
సెంటిమెంట్ పరంగా కూడా అలోచించి పక్కన పెడుతుంటారు. మెహ్రీన్ విషయంలో ఫ్లాప్స్, సెంటిమెంట్స్ ఏవీ ప్రభావం చూపించడం లేదు. చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎఫ్ 2లో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నోటాలో నటిస్తోంది. ఈ రెండే కాకుండా ఇటీవలే సుధీర్ బాబు సరసన నటించడానికి మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకి కూడా ఓకే చెప్పేసింది. ఇలా నాలుగు సినిమాలతో లక్కీ గర్ల్ అని పేరుతెచ్చుకుంది. ఇవి హిట్ అయితే మరో రెండేళ్లు మెహ్రీన్ టాలీవుడ్ లో బిజీ కావడం ఖాయం.