మైత్రి.. మళ్ళీ డబుల్ రిస్క్ అవసరమా?
- January 25, 2025 / 06:00 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో హై లెవెల్ కు వెళుతున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers ) 2024లో “పుష్ప 2” తో (Pushpa 2 The Rule) గ్లోబల్ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే, 2025 సమ్మర్‌ను టార్గెట్ చేస్తూ ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ సినీ పరిశ్రమలోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. “జాట్” (Jaat) అనే బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, తమిళ బిగ్ మూవీ “గుడ్ బ్యాడ్ అగ్లీ” రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
Mythri Movie Makers

ఈ రెండు సినిమాల కోసం కూడా దాదాపు 400 కోట్లకు ఫైనే ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్నాయి. మైత్రి బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ “జాట్” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనుంది. అటు “గుడ్ బ్యాడ్ అగ్లీ” తమిళనాట భారీ అంచనాల మధ్య ఉంటుండటంతో రెండు చిత్రాలు ఒకే రోజు రావడం రిస్కీ డెసిషన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” కి సూపర్ క్రేజ్ ఉండగా, అదే రోజు “జాట్” కూడా విడుదల చేయడం వల్ల స్క్రీన్ షేరింగ్ సమస్యలు ఏర్పడతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు తెలుగులో కూడా రెండు చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు ఒకే రోజు రావడం ప్రేక్షకుల మధ్య గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మైత్రి ఒక చిత్రం విడుదలను వాయిదా వేస్తుందా లేక రిస్క్ తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో మైత్రి 2023 సంక్రాంతి సీజన్‌లో “వీరసింహా రెడ్డి” (Veera Simha Reddy) “వాల్తేరు వీరయ్య” (Waltair Veerayya) చిత్రాలను చిన్న గ్యాప్ లోనే విడుదల చేసి భారీ విజయాలు సాధించింది. కానీ ఈసారి రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం మరింత రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి. పైగా రెండు చిత్రాల ఖర్చులు భారీ స్థాయిలో ఉండటంతో, లాభాలను పంచుకునే అవకాశం తగ్గిపోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి చేసిన ప్లాన్ ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.












