సినిమా అంటే అన్ని సంఘాలు కలసి పని చేసుకోవాలి. ఇటు నటీనటుల సంఘం, అటు నిర్మాతల సంఘం కలిసి ముందుకెళ్తేనే సినిమాలు సక్రమంగా తీయగలరు, సక్రమంగా పంపిణీ చేయగలరు, సక్రమంగా జనాలకు చూపించగలరు. ఇక ఫలితం అంటారా అది జనాల చేతుల్లోనే ఉంటుంది. అయితే కీలకమైన ఆ సంఘాలు మధ్య ఆందోళనకర పరిస్థితి తలెత్తితే.. ఇదిగో తమిళ సినిమా పరిశ్రమలా ఉంటుంది. ఇటీవల జరిగిన తమిళ సినిమా సంఘాల సమావేశం, ఆ తర్వాత జరిగిన నటీనటుల సంఘం సమావేశాలే ఇప్పుడు ఆ పరిస్థితికి కారణం.
మొన్నటికిమొన్న విశాల్‌ను (Vishal) నిర్మాతల మండలి టార్గెట్ చేసింది. ఇప్పుడు ధనుష్ (Dhanush) పై కూడా ఆరోపణలు చేసింది. ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోంది. దీంతో నిర్మాతల మండలిపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇది టీకప్పులా తుపానా? లేక అసలు తుపానా? అనే చర్చ మొదలైంది. తమిళ సినీ నిర్మాతల మండలి నుండి ఇటీవల ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో సినిమా నిర్మాణం గురించి, విడుదల గురించి, హీరోల గురించి చాలా విషయాలు స్పందించారు.
దీంతో అత్యవసరంగా నడిగర్ సంఘం సమావేశమైంది. అధ్యక్షుడు నాజర్ (Nassar) , జనరల్ సెక్రటరీ విశాల్, ట్రెజరర్ కార్తి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో తమిళ సినీ నిర్మాతల మండలి చేసిన వ్యాఖ్యల్ని నడిగర్ సంఘం తప్పుబట్టింది. నటీనటుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా నడిగర్ సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని.. అంతేకానీ నేరుగా చర్యలకు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించింది. అంతేకానీ నేరుగా చర్యలకు ఎలా సిద్ధమవుతారని.. దీనిని ఖండిస్తున్నామని కార్తి అన్నారు.
ఇన్నాళ్లూ నిర్మాతల మండలి, నటీనటుల మండలి సమన్వయంతో పనిచేశాయని, ఇప్పుడు నిర్మాతల మండలి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని కార్తి (Karthi) ఆరోపించారు. ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు నిలిపివేస్తున్నట్టు కానీ, నిర్మాణంలో ఉన్న సినిమాల్ని అక్టోబర్ 30లోగా పూర్తిచేయాలనే తీర్మానాలు కానీ తమ దృష్టికి రాలేదని నడిగర్ సంఘం అంటోంది. వేలాది మంది కార్మికుల జీవితాలతో కనెక్ట్ అయిన ఉన్న సినీ పరిశ్రమలో సమ్మె చేయబోతున్నామనే నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని నడిగర్ సంఘం అంటోంది. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పెట్టి.. అప్పుడు తమ నిర్ణయాలు వెల్లడిస్తామని అంటున్నారు.