అక్కినేని నాగార్జున (Nagarjuna) సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు. శోభన్ బాబు తర్వాత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో అనే పేరు కూడా సంపాదించుకున్నారు నాగ్. అలా అని.. ఎప్పుడూ ఒకే జోనర్లో సినిమాలు చేయలేదు. కథల ఎంపికలో తన మార్క్ చూపిస్తూ వచ్చారు. అందుకే స్టార్ అయ్యారు. నాగార్జునలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే.. అభిమానుల ఫీడ్ బ్యాక్ ని ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటారు, వెంటనే కరెక్ట్ చేసుకుంటారు.
Nagarjuna
గతంలో అక్కినేని అభిమానులతో ఆయన చర్చలు జరిపేవారు.. కుదరకపోతే ఫోన్లో మాట్లాడేవారు అని ఆయన సన్నిహితులు చాలా మంది చెబుతుంటారు. అభిమానుల ఫీడ్ బ్యాక్ వల్లే ఆయన కెరీర్లో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కూడా చేరిందట. అదెలా అంటారా? అక్కడికే వస్తున్నా.! గతంలో నాగార్జున- కృష్ణవంశీ (Krishna Vamsi) కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’ (Ninne Pelladata) అనే సినిమా వచ్చింది. అయితే నాగార్జున- కృష్ణవంశీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు వేరే కథ అనుకున్నారట.
‘అన్యాయం’ అనే టైటిల్ తో నాగార్జునతో సినిమా చేయాలని చూశారట కృష్ణవంశీ. లొకేషన్స్ కోసం రెక్కీకి వెళ్లగా.. ఓ చోట నాగ్ అభిమాని కృష్ణవంశీ వద్దకి వచ్చి.. ‘ఎందుకయ్యా నువ్వు కూడా మీ బాస్ మాదిరే చేస్తున్నావ్?’ అని అన్నాడట. ఎందుకంటే కృష్ణవంశీ తీసిన ‘గులాబీ’ ఆయన గురువు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) స్టైల్లో ఉంటుంది. సో కృష్ణవంశీకి అంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడలేదు అని జనాల అభిప్రాయం కావచ్చు. దీంతో నాగ్ ను కలిసి ఈ విషయం చెప్పగా..
‘వేరే కథ చేద్దాం’ అని అన్నారట. తర్వాత ‘నిన్నే పెళ్ళాడతా’ కథ గురించి చెప్పగా ఇంప్రెస్ అయ్యారట నాగ్. ‘ఇలాంటి కథ కదా నేను నిన్ను తీసుకురమ్మన్నది’ అని వెంటనే డేట్స్ ఇచ్చేశారట నాగ్. తర్వాత ‘నిన్నే పెళ్ళాడతా’ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడం.. నాగార్జునకి నిర్మాతగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టడం జరిగింది. అందుకే అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలని నాగ్ తో పాటు చిరు వంటి హీరోలు కూడా చెబుతుంటారు.