దిల్ రాజ్, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా రూపొందుతున్న ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా నాని ఫుల్ మాస్ అవతార్ లో దర్శనమిస్తున్నాడు. అటువైపు దిల్ రాజు సహా చిత్ర బృందమంతా సినిమాలో నాని పాత్ర ‘మ..మ..మాస్, ఊరమాస్’ అంటూ చెప్పుకొస్తున్నారు. సరే నాని ఈ జోనర్ కూడా ట్రై చేస్తున్నాడనుకుంటే.. దర్శకుడు త్రినాధరావు మీద ఓ గాసిప్ మొదలయింది.
‘సినిమా చూపిస్తా మావ’ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టి సినీ జనాల దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ సినిమా కథ దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమా ‘నువ్వే నువ్వే’ కి జిరాక్స్ కాపీ. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఓ కుర్రాడు ప్రేమిస్తే ఆ ప్రేమ పట్ల తండ్రి స్పందన ఏంటన్నది సినిమా. ఈ కథలో త్రివిక్రమ్ తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూనే తన కథనంతో, సంభాషణలతో ప్రేమికుడినీ గెలిపించారు. త్రినాధరావు వద్దకొచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఎలాంటి అనుమతి లేకుండా కాలేజీలో చేరి అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించడం అంటూ.. లాజిక్ లేకపోయినా కామిడీ బాగా దట్టించి కుర్రకారుని కిక్కిచ్చాడు. ఫలితంగా చిన్న సినిమా అయినా పెద్ద విజయంగా మారింది.
ఇక ప్రస్తుత విషయానికొస్తే.. నాని హీరోగా చేస్తున్న సినిమా కూడా పూరి జగన్నాధ్ ‘ఇడియట్’ లోని రవితేజ పాత్రని పోలి ఉంటుందని గుసగుసలు. టైటిల్ కూడా ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘నేను లోకల్’ అని పెట్టడం ఈ గుసగుసలకి బలం చేకూర్చేలా ఉంది. ఇది ఎంతవరకు నిజమన్నది తేలేది డిసెంబర్ లోనే. క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నాని అంటే హిట్.. హిట్ అంటే నాని అన్నట్టు వుంది. ఆ రేంజ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మన గంటా నవీన్ బాబు. ఆయనెవరు అనేరు..! నాని అసలు పేరు అదే. త్రినాథ రావు తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ నానికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో మరి..