నక్కతోక తొక్కినోడిలా నేచురల్ స్టార్ నాని వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తాజాగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ హిట్ జాబితాలో చేరిపోయింది. వరుసగా ప్రేమకథ చిత్రాలతో దూసుకొచ్చిన నాని ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నారు. దానిని అభినందించాల్సిందే.. కానీ స్టార్ హీరోలని లెక్కచేయకుండా యుద్ధానికి దిగడమే బాగాలేదని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనిని తొందరగా పూర్తి చేసి 2018 ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.
ఆ నెలలో మహేష్ భరత్ అనే నేను.. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” రిలీజ్ కానున్నాయి. వారు కూడా డేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రజినీకాంత్ 2.0 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుందా? కాదా? అని ఆలోచిస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే దానికంటే వారం ముందు గాని,15 రోజుల ముందుగాని సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. నాని మాత్రం అవేమి పట్టించుకోకుండా రిలీజ్ డేట్ ప్రకటించారు. అందుకే నానిని వేగం తగ్గించమని సినీ పండితులు సలహా ఇస్తున్నారు.