కరోనా కేసులు తగ్గడంతో.. థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా కొన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. ఆ తరువాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచేశారు. దీంతో సినిమాల కలెక్షన్స్ పెరగడం మొదలైంది. ఇది చూసి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. రోజురోజుకి కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు తప్పేలా లేవు.
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీని యాభై శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఆ దిశగా అడుగులుపడడం ఖాయమని తెలుస్తోంది. దీంతో వచ్చే వారంలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’ సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ లాంటి భారీ సినిమా థియేటర్లో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆగాయని.. మరికొన్ని రోజుల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన ‘టక్ జగదీష్’ సినిమా కూడా వాయిదా పడక తప్పేలా లేదు.
‘లవ్ స్టోరీ’ సినిమా వాయిదా పడిందని తెలియగానే.. నాని సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే సందేహాలు కలిగాయి. వచ్చే వారంలో కరోనా ప్రభావం ఎలా ఉండనుంది..? ప్రభుత్వం థియేటర్లపై ఆకాంక్షలు విధిస్తుందా లేదా అని చూసి దాన్ని బట్టి ‘టక్ జగదీశ్’ సినిమాను వాయిదా వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సినిమా వాయిదా వేస్తే.. వచ్చే నెలలో అన్నీ భారీ సినిమాలు ఉండడంతో అప్పటికి మళ్లీ డేట్ దొరికే ఛాన్స్ ఉండదు. మరి నాని రిస్క్ తీసుకొని ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేస్తాడేమో చూడాలి!