నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన హిట్ 3 (HIT 3) సినిమా మే 1న విడుదల కానుంది. ఈసారి నాని అర్జున్ సర్కార్ అనే రఫ్ అండ్ ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి సెన్సార్ టెన్షన్ మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో హిట్ 3 స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. అది కూడా సినిమా విడుదలకు మూడో వారం ముందే జరగడం విశేషం.
ఈ ప్రదర్శనకు నాని కూడా హాజరవడంతో ఇండస్ట్రీలో ఇదే చర్చగా మారింది. ఈ స్పెషల్ సెన్సార్ స్క్రీనింగ్ చేయడం వెనక కారణం ఏంటంటే, ముందుగానే సినిమాకు సంబంధించిన క్లారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనట. ఈ ప్రదర్శన తర్వాత సెన్సార్ బోర్డు నుండి ఇప్పటివరకు ఎటువంటి అభిప్రాయాలు బయటకు రాలేదు. కానీ టాక్ ప్రకారం, సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయట. అందుకే కొన్ని సీరియస్ కట్స్ సూచించే అవకాశముందని అంటున్నారు. దీనికోసం వాల్ పోస్టర్ బ్యానర్ ముందుగానే ఓ ప్లాన్ రెడీ చేసిందట.
ఒకవేళ సెన్సార్ బోర్డు పెద్దగా కట్స్ సూచిస్తే, రివిజన్ కమిటీకి వెళ్లాలని లేదా మళ్లీ ఎడిటింగ్ చేయాలని టీమ్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. సినిమా మొత్తం అర్జున్ సర్కార్ క్యారెక్టర్ మూడ్ మీద ఆధారపడుతున్నందున, కట్స్ పడితే టోన్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే నాని కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్షన్‌లో రూపొందిన హిట్ 3 ఇప్పటికే రెండు హిట్స్ తరువాత వస్తోంది. ఈసారి నాని మాస్ ఇమేజ్, ఇంటెన్స్ కథతో బాక్సాఫీస్‌కి పెద్ద షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టెక్నికల్ వర్క్ కూడా బాగా ఆకట్టుకుంటుందట. ఇక సెన్సార్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.