నానికి కథల ఎంపిక విషయంలో చాలా పట్టు ఉంది. అందుకే వరుస విజయాలు అందుకుంటున్నాడు అనేవారు గతంలో. అయితే ఆ పట్టు సడలిందో ఏమో వరుస పరాజయాల తర్వాత నాని గురించి ఆ మాట ఎవరూ అనలేకపోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఫ్లాప్ అయిన సినిమాల్ని నాని ఫ్లాప్ అని ఒప్పుకోవడం లేదు. ఆ విషయం పక్కనపెడితే.. తనకు ఫ్లాప్ (నాని దృష్టిలో హిట్) ఇచ్చిన దర్శకుడికి నాని మరో అవకాశం ఇచ్చాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
‘మెంటల్ మదలో’, ‘బ్రోచేవారెవరురా’ అంటూ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసి.. నానితో సినిమా చేసే ఛాన్స్ సంపాదించారు వివేక్ ఆత్రేయ. తొలి రెండు సినిమాల కాన్సెప్ట్‌లు, ఫీల్ చూసి మూడో సినిమా ‘అంటే సుందరానికి’ కూడా విజయం సాధిస్తుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే సినిమాకు భారీ బజ్ వచ్చింది. దానికి సినిమా కాస్ట్ అండ్ క్రూ.. నాని అండ్ టీమ్ చేసిన ప్రచారం కూడా ఓ కారణం అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే.. సినిమాకు ఆశించిన విజయం రాలేదు.
అయితే ఆ ఫలితం ఇప్పుడు వివేక్ నాలుగో సినిమాకు అడ్డు రాలేదు అంటున్నారు. అవును, వివేక్ ఆత్రేయ నాలుగో సినిమా ఆల్‌మోస్ట్ ఫిక్స్ అయిపోయిందంటున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నాని అంగీకరించాడని సమాచారం. వివేక్ శైలి వైవిధ్యభరితమైన కథతో, నాని మార్క్ ఎంటర్‌టైన్మెంట్ జోడించి ఈ సినిమా కథను ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేదెవరు అనేది ఇంకా తేలలేదు. ఒకట్రెండు రోజుల్లోనే అనౌన్స్‌మెంట్ అంటున్నారు కాబట్టి.. ఆ రోజు తెలిసిపోవచ్చు. తొలి సినిమా ఇచ్చిన ఫలితంతో ఈ సినిమా మీద అంచనాలు అయితే తక్కువగా ఉంటాయి. ఇలా అంచనాలు లేకుండా వచ్చి హిట్లు కొట్టడం నానికి బాగా అలవాటు. కాబట్టి ఈ సినిమాకు మంచి అవకాశం ఉంది అంటున్నారు.