సినీ అభిమానులు ఊహించిన విధంగానే ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడింది. సినిమా రిలీజ్ కు ప్రపంచవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు లేకపోవడం, కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం, ఏపీలో టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ మరోసారి సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావచ్చని ప్రచారం జరుగుతున్నా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడి నాలుగుసార్లు వాయిదా పడిన చెత్త రికార్డు మాత్రం ఆర్ఆర్ఆర్ కు మాత్రమే సొంతమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తై రిలీజ్ డేట్ వాయిదా పడటం ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రమే జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు ముహూర్త బలం బాలేదని కామెంట్లు చేస్తున్నారు.
2018 సంవత్సరంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొదలైంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యమైనా ఖర్చు విషయంలో రాజీ పడకుండా విజువల్ వండర్ గా జక్కన్న ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదట 2020 సంవత్సరం జులై 30వ తేదీని రిలీజ్ డేట్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా 2021 సంవత్సరం జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. ఆ తేదీకి కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 13వ తేదీకి జక్కన్న సినిమాను వాయిదా వేశారు.
అక్టోబర్ 13వ తేదీనాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో 2022 సంవత్సరం జనవరి 7వ తేదీకి రిలీజ్ డేట్ మారింది. అయితే మళ్లీ రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాపై అంచనాలు తగ్గుతున్నాయి. కరోనా కేసులు తగ్గితే మాత్రమే సమ్మర్ లో ఆర్ఆర్ఆర్ రిలీజవుతుందని అలా జరగని పక్షంలో ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యమవుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఆలస్యమవుతూ ఉండటంతో చరణ్, తారక్ కెరీర్ పై ఆ ప్రభావం పడుతోంది.