సరైన ప్లానింగ్ ఉంటే సినిమాతో హిట్ కొట్టడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. కానీ.. ఆ సక్సెస్ తో స్టార్ డమ్ సొంతం చేసుకోవడం మాత్రం అంత ఈజీ పనేమీ కాదు. కానీ.. అదృష్టం కలిసొచ్చిందో లేక ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందో తెలియదు కానీ.. సడన్ స్టార్ కంటే ఫాస్ట్ గా రాకెట్ స్పీడ్ తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” అనంతరం “గీత గోవిందం”తో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు యంగ్ హీరోస్ లో టాప్ మాత్రమే కాదు అగ్ర కథానాయకులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు.
ఈ ఊపులో వచ్చిన విజయ్ తాజా చిత్రం “నోటా” కూడా మునుపటి హిట్ చిత్రాల స్థాయిలోనే సూపర్ హిట్ అయిపోతుంది అనుకొన్నారందరూ. కానీ.. సినిమాకు మొదటి రోజే మిశ్రమ స్పందన లభించింది. తమిళనాట బిలో యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ గా డిక్లేర్ చేయబడగా.. ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రీమియర్స్ తో కలిపి ఇప్పటివరకూ కనీసం హాఫ్ మిలియన్ కూడా దాటలేదు. ఇకపై దాటుటుందన్న నమ్మకం కూడా లేదు. దాంతో భారీ మొత్తానికి “నోటా” హక్కులు సొంతం చేసుకొన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది.