ఇరవై ఏళ్ళు నిండకుండానే ఎన్టీఆర్ తెలుగు వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమాకి సినిమాకి అభిమానులను పెంచుకుంటూ వచ్చారు. అందుకే అతను బయట కనిపిస్తే ఆప్రాంతంలో పండుగ లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎన్టీఆర్ నిన్న తన భార్య లక్ష్మి ప్రణతి తో కలిసి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తారక్ ఆలయానికి వస్తున్నారని తెలియగానే అతని చూడాలని వేలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఎన్టీఆర్ వెంట వచ్చిన బౌన్సర్లు తమ ప్రతాపం చూపడంతో అటు అభిమానులూ.. ఇటు పాత్రికేయులూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అంతేకాదు తమ అభిమాన నటుడు బస చేసిన భవనం నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా అభిమానులంతా భవనంలోకి చొచ్చుకురావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. తొలిసారిగా భద్రాద్రి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు .. ఆ సందర్భాన్ని సినిమా ప్రచారానికి, ఎన్నికల గురించి మాట్లాడటానికి ఉపయోగించకూడదని ఉద్దేశంతో ఎన్టీఆర్ ఎటువంటి ప్రసంగాలు చేయలేదని ఆయన సన్నిహితులు వెల్లడించారు.