విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ‘ఒరు నల్లా నాల్ పాతు సొలన్’ అనే తమిళ చిత్రం రూపొందింది. మెగా డాటర్ నిహారిక, గౌతమ్ కార్తీక్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ వాస్తవానికి 2018లో విడుదలైంది. అక్కడ మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది ఈ మూవీ.తర్వాత విజయ్ సేతుపతి కి తెలుగులో కూడా క్రేజ్ పెరగడంతో గత ఏడాది అంటే 2021 ఏప్రిల్ 02 న తెలుగులో కూడా డబ్ చేసి థియేటర్లలో విడుదల చేయడానికి ట్రై చేశారు.కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : యమజంకపురంలో యముడిని పూజించే యమన్ అలియాస్ విజయ్ సేతుపతి అలాగే అతని మనుషులు ఓ దొంగతనం కోసం సిటీలోకి వస్తారు.దొంగతనం వాళ్ళ వృత్తి. ఈ ప్రాసెస్ లో వారికి యమన్ అలియాస్ విజయ్ సేతుపతి భార్య నిహారిక పాత్ర వారికి కనిపిస్తుంది. అప్పుడు దొంగతనంతో పాటు ఆమెను కూడా కిడ్నాప్ చేయడానికి యమన్ అండ్ టీం ప్లాన్ చేస్తారు. ఆమెను కిడ్నాప్ చేస్తారు. అయితే ఆల్రెడీ ఆమె గౌతమ్ కార్తీక్ పాత్రతో ప్రేమలో ఉంటుంది. అసలు నిహారిక పాత్ర..
విజయ్ సేతుపతికి ఎందుకు భార్య అయ్యింది? ఎందుకు అతను ఆమెను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది.మధ్యలో గౌతమ్ కార్తీక్ తో ఆమె ప్రేమలో పడటం ఏంటి? తన ప్రేయసిని దక్కించుకోవడం కోసం గౌతమ్ కార్తీక్ పాత్ర ఏం చేసింది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ఈ లిస్ట్ లో ముందుగా అలాగే మెయిన్ గా చెప్పుకోవాల్సిన నటుడు విజయ్ సేతుపతి. వింత వింత గెటప్ లతో అక్కడక్కడా తన మార్క్ కామెడీతో..ఏ మాత్రం కంటెంట్ లేని ఈ కథని తన భుజాల పై వేసుకున్నాడు. ఎంత ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రాన్ని చివరి వరకు చూడటం అంటే చాలా కష్టమనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఓపిక చేసుకుని చివరి వరకు చూసాము అంటే అది విజయ్ సేతుపతి నటన వల్లనే అని చెప్పాలి. కాకపోతే తెలుగు ప్రేక్షకులు ఇతన్ని హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు.
అందుకే ఇతని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. జనాలు పట్టించుకోవడం లేదు. ఇక నిహారిక ఎక్కడిక్కడ బ్లాంక్ ఫేస్ పెట్టేసింది. ఈ సినిమా తెలుగులో విడుదల చేసే ఆలోచన ఉన్నప్పుడు కనీసం ఆమె పాత్రకు తనచేతే డబ్బింగ్ చెప్పించే ప్రయత్నమైనా చేయాల్సింది. అది కూడా చేయలేదు. ఎవరో చెప్పిన వాయిస్ ఈమెకు అస్సలు సూట్ అవ్వలేదు. ఇక గౌతమ్ కార్తీక్ పాత్ర అటు సీరియస్ రోల్ అనీ చెప్పలేము ఇటు సిల్లీ రోల్ అనీ చెప్పలేము. మిగిలిన నటీనటుల పాత్రలు ఎంత మాత్రం గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు అరుముగా కుమార్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ కు సెకండ్ హాఫ్ లో ఏదో ఉంటుంది అనే క్యూరియాసిటీని రేకెత్తించాడు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తో ఇంప్రెస్ చేశాడు. అంతకు మించి ఇతను చేసింది ఏమీ లేదు. మిగిలిన ప్లాట్ అంతా చాలా సిల్లీగా ఉంటుంది. అతను చేసిన మంచి పని ఏంటి అంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఎంచుకోవడం.
సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలు ఉన్నప్పటికీ.. 3 గంటల పైనే కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది.సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఓ పాటతో, అక్కడక్కడ నేపథ్య సంగీతంతో ఇంప్రెస్ చేశాడు. ఎడిటింగ్ బ్యాడ్, సినిమాటోగ్రఫీ అక్కడక్కడా పర్వాలేదు. కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాలేదు.
విశ్లేషణ : విజయ్ సేతుపతి సినిమా కాబట్టి.. అదీ ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి ఓసారి ట్రై చేద్దాం అనుకుంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా చూడాలి. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే కష్టమే.