వెండితెరపై దేవుడిగా మారడానికి పనవ్ కల్యాణ్ మరోసారి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘గోపాల గోపాల’తో కృష్ణుడిగా మారి అలరించిన పవన్… ఇప్పుడు మరోసారి దేవుడి పాత్ర కోసం సిద్ధమవుతున్నాడట. తొలిసారి వెంకటేశ్ కోసం దేవలోకం నుండి భూలోకం వచ్చిన పవన్… ఈ కుటుంబ సభ్యుడి కోసం వస్తున్నాడట. అవును మెగా కుటుంబానికి చెందిన హీరోతోనే ఈ మల్టీస్టారర్ ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జోరుగా నడుస్తున్నాయట. త్వరలో దీనిపై ప్రకటన ఉంటుందని సమాచారం.
ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ పెట్టాక త్రివిక్రమ్ నిర్మాతగా వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ వస్తున్నారు. నవీన్ పొలిశెట్టి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ధనుష్‌తో ‘సర్’ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మూడో సినిమాగా పవన్ కల్యాణ్ సినిమా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. తమిళంలో ఇటీవల విడుదలైన మంచి విజయం అందుకున్న ‘వినోదాయ సితాం’ సినిమానే ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారట. ‘వినోదాయ సితాం’ అంటే విచిత్ర ఆలోచన అని అర్థం.
చనిపోయిన ఓ వ్యక్తి స్వర్గానికి వెళ్తే… అక్కడ దేవుడు చూసి ఈ వ్యక్తి బాగా డల్‌గా ఉన్నాడని కారణాలు తెలుసుకుంటాడట. ఈ క్రమంలో అతను కుటుంబ సమస్యలు, పరిస్థితులు వివరిస్తాడు. వాటిని పూర్తి చేయడానికి నీకు మూడు నెలల సమయం ఇస్తానని దేవుడు ఆ వ్యక్తితో చెబుతాడు. దీంతో వాటి సంగతి తేల్చడానికి ఆ వ్యక్తి భూమి మీదకు తిరిగి వస్తాడు. అతనితోపాటు దేవుడు కూడా భువికి వస్తాడు. అప్పుడేమైంది… ఆ వ్యక్తి అన్ని సమస్యలు ఫిక్స్ చేసుకున్నాడా అనేదే సినిమా కథ. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయనే కీలక పాత్ర పోషించారు కూడా.
ఇప్పుడు ఇదే కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కించాలని చూస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ పని మీదే బిజీగా ఉన్నారని టాక్. తమిళ మాతృకను తెరకెక్కించిన సముద్రఖనినే ఇక్కడ కూడా డైరెక్ట్ చేస్తారని టాక్. పవన్ పాత్ర నిడివి సుమారు 30 నుండి 40 నిమిషాలు ఉంటుందని టాక్. కాబట్టి కొన్ని రోజుల కాల్‌షీట్లతో పని అయిపోతుంది. సాయిధరమ్‌తేజ్ పూర్తిగా కోలుకున్నాక సినిమా అనౌన్స్ చేస్తారట. తమిళంలో ప్రధాన పాత్రధారి వయసు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కుర్రాడిలా చూపిస్తారేమో.