టాలీవుడ్‌లో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన వివరాలను నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. మండలికి సంబంధించిన కార్యకలాపాల మీద ఇటీవల పెద్ద ఎత్తున చర్చ, రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. ఎన్నికల వివరాలతోపాటు మండలి నుండి తొలగించిన ఇద్దరు నిర్మాతల గురించి కూడా సి.కల్యాణ్ తెలిపారు.
నిర్మాతలకు నిర్మాతల మండలి అమ్మ లాంటిది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సహా అందరినీ ఈ సంస్థలోకి తీసుకొస్తాం. ఎప్పట్లాగే మండలి వైభవాన్ని కొనసాగిస్తాం అంటూ సి.కల్యాణ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గం ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలిపారు. తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ఫిబ్రవరి 18న జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుండి 6 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఒక్కో పదవికి ఒకరు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది అని సి.కల్యాణ్ తెలిపారు.
అంతేకాదు మండలిలోని ఇద్దరు సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు సి.కల్యాణ్ తెలిపారు. మండలి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిర్మాత కె.సురేష్‌బాబుపై మూడేళ్ల నిషేధం విధించారు. మరో నిర్మాత యలమంచి రవిచంద్‌ను శాశ్వతంగా మండలి నుండి తొలగించారు. నిర్మాతల మండలికి చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదని, వాళ్లందరిపై కఠిన నిర్ణయాలు ఉంటాయని సి.కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే నంది, సింహా పురస్కారాల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని కోరారు.
దీంతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వెల్లడం గురించి కూడా స్పందించారు. తాను గతంలో చెప్పినట్లు టాలీవుడ్ ఎక్కడికీ వెళ్లదని. ఇక్కడ అలవాటు పడ్డవారు ఏపీకి వెళ్లరు అని మరోమారు స్పష్టం చేశారు సి. కళ్యాణ్. మద్రాస్ నుండి హైదరాబాద్ రావడానికి చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు మళ్లీ వేరేదగ్గరకు అంటే కష్టమే అని చెప్పారు సి.కల్యాణ్.