ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించబోతోన్న ఇటీవలే నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
‘నీకు ఒకడి ఫోటో పంపిస్తున్నా.. మన స్టైల్లో శాల్తీ గల్లంతైపోవాలి’.. అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. హీరోగా నటించిన అభిలాష్ సుంకరలోని వేరియేషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. రొమాంటిక్, యాక్షన్ ఎఫిసోడ్స్‌లో హీరో మెప్పించారు. ఇక విలన్‌గా నటించిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కొత్తగా కనిపించారు. ఎవడ్రా ఆ కిల్లర్ అంటూ ట్రైలర్ ఎండ్‌లో వచ్చిన డైలాగ్.. సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉంది.
ట్రైలర్‌లో కోటి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. నవీన్ కుమార్ చల్లా ఫోటో గ్రఫీ అద్భుతంగా ఉంది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. సినిమా మీద అంచనాలు పెంచేసింది.
ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మా అందరికీ ఎంతో కావాల్సిన వ్యక్తి. సుంకర క్రియేషన్స్ మీద ఆయన అన్న సత్యనారాయణ సుంకర నిర్మాతగా.. వాళ్ల తమ్ముడు హీరోగా మా రవి డైరెక్టర్‌గా పగ పగ పగ చిత్రం రాబోతోంది. రవి అంటే మా అందరికీ చాలా ఇష్టం. అమెరికాలో ఉద్యోగం వదిలేసి మరీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. కామెడీ సినిమాను సీరియస్‌గా, సీరియస్ సినిమాను కామెడీగా తీసినట్టు అనిపించింది. మోషన్ పోస్టర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కరోనా, సెకండ్ లాక్డౌన్‌లో ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రయూనిట్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. రామ్ సుంకర ఇక్కడ సంపాదించిన డబ్బును ఇక్కడే ఖర్చు పెడుతున్నారు.. అలాంటి వారికి ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 22న ఈ చిత్రం రాబోతోంది. ఉదయం ఆటను ఫ్రీగా చూపించబోతోన్నారు. వీళ్ల ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.