సెల్‌ఫోన్ నంబర్ నైబర్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ‘కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బాక్సాఫీసు దగ్గర మిశ్రమ ఫలితం అందుకుంది అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాపై ఆఖరి రివ్యూ వచ్చేసింది. అదేనండీ సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా గురించి తన అభిప్రాయం చెప్పారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పిన ఆయన, హీరో నటనను, కథను మెచ్చుకున్నారు. అయితే ఈ కొన్ని మార్పులు చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని చెప్పారు.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ సినిమాకు గమ్మత్తయిన టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమ మనసును హత్తుకునే చిత్రం. సెల్ ఫోన్లు ఉపయోగించే చాలామంది పిల్లలకు ఈ సినిమా ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. ఒక ఫోన్ కారణంగా వ్యక్తుల మధ్య ప్రేమ పెరిగింది. అలాగే ఒక వ్యక్తి ప్రాణాలే పోయే స్థితికి చేరుకున్నాడు. మరొకరికి చీటింగ్ జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఈ సినిమా ద్వారా దర్శకుడు మరోసారి చెప్పారు.
చిన్నపిల్లాడి కళ్ల ముందే అతడి తల్లిదండ్రులు చనిపోవడం వంటి దయనీయమైన అంశంతో కథను మొదలుపెట్టారు దర్శకుడు. ఆ పిల్లాడు సినిమాలో పగ ప్రతీకారాలతో ఉంటే సినిమా మరోలా ఉండేది. అలా కాకుండా ఆ పిల్లాడు మంచి గుణాలతో పెరుగుతాడు. పెద్దవాళ్లు ఏం చెబితే అదే నేర్చుకుంటాం అనే నీతిని ఈ కథతో మరోసారి తెలియజేశారు. కిరణ్ అబ్బవరం చాలా నేచురల్‌గా నటించాడు అని పరుచూరి వివరించారు.
సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ తరచుగా తన ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి చెప్పారు. థియేటర్లలో మిశ్రమ ఫలితం అందుకుందని చెప్పిన ఈ సినిమా.. ఓటీటీల్లోనూ మంచి స్పందన సాధించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు పరుచూరి రివ్యూ ఇవ్వడంతో రివ్యూల పర్వం ముగిసింది అని చెప్పాలి.