పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నా, సినిమాల మీద ఆసక్తి తగ్గించకపోవడం అతని అభిమానులకు నిజంగా గొప్ప గిఫ్ట్ అవుతోంది. ఇప్పటికే ఆయన చేతిలో ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu), ‘ఓజి’ (OG Movie), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) లాంటి ప్రాజెక్ట్‌లు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా, కొత్తగా మరొక ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఇప్పటికే పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 పూర్తిచేసి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా రాబోతోంది. మరోవైపు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ సినిమాకు కూడా రెండు భాగాలుగా ప్లాన్ ఉంది. గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో పవన్ కనిపించనున్న ఈ సినిమాలోని సీన్‌లు ఇప్పటికే అభిమానుల్లో హైప్ పెంచాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ ఒక స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ లైనప్‌లోకి ఇప్పుడు కొత్తగా నిర్మాత రామ్ తళ్లూరి ప్రాజెక్ట్ చేరబోతుందనే టాక్ వినిపిస్తోంది. రామ్ తళ్లూరి మూడు సంవత్సరాల క్రితమే పవన్‌కు అడ్వాన్స్ ఇచ్చారని, మొదట సురేందర్ రెడ్డితో (Surender Reddy) సినిమాను ఫైనల్ చేయాలని భావించినా అది కుదరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ తళ్లూరి మరొక డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
పవన్ తన రాజకీయ బాధ్యతల మధ్య షూటింగ్ సమయాన్ని సెట్ చేయడం సులభం కాకపోయినా, ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు ఈ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా క్లారిటీకి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో పాటు పవన్ ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమా లైనప్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలను ఏర్పరుస్తోంది.