జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab) , భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలకు రిలీజ్ సమయంలో ఏపీలో థియేటర్ల విషయంలో, టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తక్కువ టికెట్ రేట్ల వల్ల ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ సమయంలో నేను ఎవరి కాళ్లు పట్టుకోవాలని భావించలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆ సినిమాను అవసరం అనుకుంటే యూట్యూబ్ లో ఉచితంగా రిలీజ్ చేయాలని కూడా భావించానని పవన్ తెలిపారు. నాకు ఆత్మ గౌరవం ఎంతో ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవసరం అయితే ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని దేహీ అని మాత్రం అననని పవన్ పేర్కొన్నారు. తాను తెగించి పాలిటిక్స్ లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించారని ఆయన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. సాగర్ కె చంద్ర (Saagar K. Chandra) డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా తక్కువ టికెట్ రేట్ల వల్ల ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేకపోయింది. మరోవైపు ఎన్నికల్లో పవన్ గెలిచినా పూర్తి చేయాల్సిన సినిమాల జాబితా మాత్రం ఎక్కువగానే ఉంది.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) , ఓజీ (OG) సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే మరో మూడేళ్ల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. పవన్ ఏ రంగంలో అడుగు పెట్టినా ఆశించిన ఫలితాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.