ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లు గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ ధరల అలా నిర్ణయించడం వెనుక ఉన్న లాజిక్ మాకు కూడా కాస్త చెప్పండి అంటూ ఆ మధ్య ప్రశ్న వేశారు ఆర్జీవీ. దానికి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. టికెట్ ధరల గురించి ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. అయితే వాటితో సంతృప్తి చెందని వర్మ మరోసారి తన ప్రశ్నలు సంధించారు. దీంతో చర్చ కంటిన్యూ అవుతోంది. ఇంతకీ నాని చెప్పిందేంటి, వర్మ మళ్లీ అడిగిందేంటో చూద్దాం.
సినిమాటోగ్రఫీ చట్టం ఎప్పటి నుండో దేశంలో అమల్లో ఉందని, తానూ, సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇదేం కొత్తగా పెట్టలేదు అని చెప్పారు మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ ధరల విషయంలో గత ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం ఏప్రిల్‌లో జారీ చేసిన జీవోను ఓ న్యాయమూర్తి సమర్థించారని, అయితే ఇటీవల మరో జడ్జి దానికి కొన్ని మార్పులు సూచించారని తెలిపారు నాని. సినిమా టికెట్‌ల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తి ఎందుకు తీర్పు ఇస్తారని నాని ప్రశ్నించారు.
సినిమాని శాటిలైట్, ఓటీటీలకు అమ్మినపుడు ప్రభుత్వంతో సంబంధం ఉండదని చెప్పిన నాని, థియేటర్లలో విడుదల చేసినపుడు మాత్రం కచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని నాని స్పష్టం చేశారు. ఆ మాటలతో సంతృప్తి చెందని వర్మ మరో కోణంలో మంత్రి నానికి మరికొన్ని ప్రశ్నలు వేశారు. ఈ మేరకు వర్మ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దాంతోపాటు మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ‘‘సినిమా సహా ఏ ఉత్పత్తికైనా ధర నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంటుంది. హీరోల రెమ్యూనరేషన్ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఆధారపడి ఉంటుంది.
దీన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలి అని వర్మ కోరారు. ఆహారధాన్యాలకు బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు. అప్పుడు నాణ్యతా లోపం తలెత్తుతుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికీ వర్తిస్తుంది అని అన్నారు వర్మ. ఒకవేళ మీరు పేదలకు సినిమా చాలా అవసరమని అనుకుంటే… సినిమా టికెట్‌కు కూడా రాయితీలు ఇవ్వొచ్చు కదా అని అడిగారు వర్మ. పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులున్నాయి. మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. మరి దీనికి నాని ఏమంటారో చూడాలి.