ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఒక మాట బలంగా వినిపిస్తుంది. ఆయన పక్కా ‘డైరెక్టర్స్ హీరో’ అని. ఒక్కసారి కథ ఒకే చేశాక, సెట్స్ లో దర్శకుడు ఏం చెబితే అది చేస్తారు తప్ప, మిగతా విషయాల్లో అస్సలు వేలు పెట్టరు. అవుట్ పుట్ విషయంలో కూడా దర్శకుడి విజన్ ను పూర్తిగా నమ్ముతారు. అందుకే ఆయనతో సినిమా చేయడానికి మేకర్స్ అంత ఆసక్తి చూపిస్తారు. కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో మాత్రం డార్లింగ్ తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి కేవలం నటించి వదిలేయకుండా, పోస్ట్ ప్రొడక్షన్ లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమా క్రియేటివ్ విషయాల్లో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర దగ్గరుండి మరీ ఫైనల్ కట్ ను పర్యవేక్షిస్తున్నారట. సినిమాలోని ప్రతి చిన్న డీటైల్ ను చెక్ చేస్తూ, ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ ఇలా ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ చూపించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. బహుశా కామెడీ, హారర్ జానర్ కాబట్టి టైమింగ్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ఇలా చేస్తున్నారని టాక్.
ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమాను పలుమార్లు వీక్షించారట. అంతేకాకుండా తన క్లోజ్ సర్కిల్ కు, నమ్మకస్తులైన టీమ్ కు కూడా స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బేస్ చేసుకుని చిన్న చిన్న మార్పులు కూడా చేయించినట్లు సమాచారం. తన జడ్జిమెంట్ తో పాటు, పక్కవాళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అవుట్ పుట్ ను మరింత షార్ప్ గా తీర్చిదిద్దారు.
ప్రభాస్, ఆయన టీమ్ ఫైనల్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఉన్నారట. మారుతి టేకింగ్, విజువల్స్, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ చాలా బాగా వచ్చిందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా, సాగదీత లేకుండా సినిమాను క్రిస్ప్ గా రెడీ చేశారు. ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగి చెక్ చేశారు కాబట్టి, క్వాలిటీ విషయంలో డౌట్ అక్కర్లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. మొత్తానికి ప్రభాస్ తీసుకున్న ఈ ఎక్స్ట్రా కేర్ సినిమాకు ఏ రేంజ్ లో ప్లస్ అవుతుందో చూడాలి.
