సాయితేజ్ అలియాస్ సాయిధరమ్ తేజ్ కి కొత్త సంవత్సరంలో అదృష్టం మరీ ఇలా కలిసొస్తుందని ఎవ్వరూ కనీసం కలలో కూడా ఊహించిఉండరు. క్రిటిక్స్ అందరూ ఎబౌ యావరేజ్ అని డిక్లేర్ చేసిపడేసిన సినిమా ఏకంగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే పెద్ద సెన్సేషన్ అనుకుంటే.. విడుదలైన మూడో వారంలోనూ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుండడం ఇంకాస్త ఆశ్చర్యపరుస్తుంది. ఆల్రెడీ 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ఇంకో పది కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద సమస్యేమీ కాదు. “ప్రతిరోజూ పండగే”తో పోటీగా విడుదలైన “రూలర్, దొంగ” చిత్రాలు ప్రేక్షకుల్ని కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోవడం.. ఆ తర్వాతి వారం విడుదలైన సినిమాలు కనీసం విడుదలైనట్లు కూడా ఎవరికీ తెలియకపోవడం.
ఇక నిన్న న్యూఇయర్ సందర్భంగా విడుదలైన “తూటా, అతడే శ్రీమన్నారాయణ, బ్యూటీఫుల్, ఉల్లాల ఉల్లాల” చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిస్థాయిలో విఫలమవ్వడంతో “ప్రతిరోజూ పండగే” థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఈస్ట్, వెస్ట్, నైజాం ఏరియాల్లో నిన్న కూడా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. సాయితేజ్ కెరీర్లో మాత్రమే కాక మారుతి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి జనవరి 9న “దర్బార్” విడుదలయ్యే వరకూ స్ట్రాంగ్ కంటెండర్ లేకపోవడంతో.. ఇక అప్పటివరకూ “ప్రతిరోజూ పండగే”.