‘నాటు నాటు..’ పాట ఆస్కార్ గౌరవం అందుకుంటుందో లేదో తెలియని రోజుల్లోనే ఓ పుకారు వినిపించింది. ‘ఈ పాటను కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ను పక్కన పెట్టేశారనేది ఆ పుకార్ల సారాంశం. అంతర్జాతీయ వేదికల మీద రాజమౌళి, రామ్‌చరణ్, తారక్ లాంటివాళ్లు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి చెప్పినా.. ఇంకా చాలదు అన్నట్లు పుకార్లు మొదలయ్యాయి. ఆస్కార్ వేడుకకు అందరూ వెళ్తున్నారు ప్రేమ్ రక్షిత్‌ని వదిలేశారు అంటూ ఆ పుకార్లకు ఇంకాస్త మసాలా దట్టించారు.
అయితే, ఆ వేడుకకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వెళ్లారు. దీంతో పుకార్లకు చెక్ పడింది. ఆ విషయాన్ని పక్కనపెడితే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆఖరి వరకు ఎందుకు ఆస్కార్ వేడుకకు వెళ్లలేకపోయారు అనే విషయంలో క్లారిటీ వచ్చింది. మాస్టర్‌కు మార్చి 9న వీసా అందిందట. దాంతో వెంటనే బయలు దేరి లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆస్కార్ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మాస్టర్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో తన వీసా విషయంలో సమస్య వచ్చిందని కార్తికేయ, వల్లి, రమ మేడమ్ చాలా కష్టపడి తనకు వీసా ఇప్పించారని కూడా చెప్పారు. ఐదు రోజుల వీసా మీద వెళ్లిన నేను అక్కడ కార్యక్రమం ముందు రోజు రిహార్సల్స్‌లో కూడా పాల్గొన్నానని తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం కన్నీళ్లు వచ్చేశాయి అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి నన్ను ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఆ క్షణం నాకు కలిఇన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అని ప్రేమ్ రక్షిత్ తెలిపారు. ‘నాటు నాటు’ పాట కోసం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సుమారు 100 వేరియన్లలో స్టెప్పులు సమకూర్చారు. వాటిలో కొన్ని తీసుకుని రాజమౌళి ఈ పాటను ఫైనల్ చేశారు. ఆయన వేసి ఐకానిక్ స్టెప్సే మొన్నీమధ్య ఆస్కార్ వేదికపై అమెరికన్ డ్యాన్సర్లు వేశారు.