ఒకప్పుడు టీవీలో సినిమా వస్తుందంటే మధ్యలో వచ్చే ప్రకటనలకు విసిగిపోయి, జనం ఓటీటీల వైపు మళ్లారు. డబ్బులు పోయినా పర్లేదు, ప్రశాంతంగా సినిమా చూడొచ్చు అనే నమ్మకంతో సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వమ్ము చేస్తోంది. డబ్బులు కట్టిన సబ్‌స్క్రైబర్లకు కూడా కంటెంట్ మధ్యలో యాడ్స్ చూపిస్తూ కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. దీంతో అసలు మేము డబ్బులు కడుతుంది యాడ్స్ చూడటానికా? అని వినియోగదారులు మండిపడుతున్నారు.
PRIME VIDEO
ఈ వ్యవహారం ఇప్పుడు ఎందుకు రచ్చగా మారిందంటే, అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ రిలీజ్ టైమ్‌లోనే ఈ కొత్త పద్ధతిని అమలు చేశారు. శ్రీకాంత్ తివారీ చేసే సీక్రెట్ మిషన్స్ చూస్తూ టెన్షన్ పడుతున్న సమయంలో, సడెన్‌గా సంబంధం లేని యాడ్స్ ప్లే అవుతుండటంతో ఆడియన్స్ మూడ్ మొత్తం స్పాయిల్ అవుతోంది. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ఏకధాటిగా చూడాలనుకునే వారికి ఇదొక పెద్ద అడ్డంకిగా మారింది.
దీనిపై నెటిజన్లు లాజికల్ పాయింట్స్ తీస్తున్నారు. యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఫ్రీగా కంటెంట్ ఇస్తాయి కాబట్టి యాడ్స్ వేసుకున్నా అర్థం ఉంది. కానీ ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైమ్ వీడియో, మళ్ళీ యాడ్స్ ద్వారా రెవెన్యూ వెతుక్కోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ వినియోగదారులను మోసం చేయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం లాభాల కోసమే క్వాలిటీని తగ్గించేస్తున్నారని విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో అయితే అమెజాన్‌పై మీమ్స్ వర్షం కురుస్తోంది. “మళ్ళీ మమ్మల్ని కేబుల్ టీవీ రోజుల్లోకి తీసుకెళ్తున్నారా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. యాడ్స్ లేకుండా చూడాలంటే బహుశా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు కట్టమని అడుగుతారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పైరసీ భూతం వెంటాడుతుంటే, ఇలాంటి నిర్ణయాల వల్ల జనం అటువైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి అయితే ప్రైమ్ వీడియో తీరుపై సర్వత్రా వ్యతిరేకత కనిపిస్తోంది. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ ఫీడ్‌బ్యాక్‌ను అమెజాన్ పరిగణలోకి తీసుకుంటుందా? లేక మొండిగా ముందుకే వెళ్తుందా? అనేది చూడాలి. ఏది ఏమైనా, డబ్బులు కట్టి కూడా యాడ్స్ చూడాల్సి రావడం మాత్రం ఓటీటీ చరిత్రలో ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి.
