ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘సలార్’ సినిమాలో నటించే అవకాశం తనకు రెండేళ్ల క్రితమే వచ్చిందని.. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తనకు ‘సలార్’ సినిమా కథ చెప్పారని.. క్యారెక్టర్ నచ్చడంతో చేస్తానని చెప్పానని తెలిపారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా తన సినిమాల డేట్స్ మారిపోవడంతో ‘సలార్’ సినిమాలో నటించలేనని ప్రశాంత్ నీల్ కి చెప్పినట్లు వెల్లడించారు.
షాజీ కైలాస్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కడువా’. ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాగా.. శనివారం హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తనకు తెలుగు సినిమా చేయాలని ఉందని కానీ డేట్స్ విషయంలో కసరత్తు జరుగుతోందని తెలిపారు.
త్వరలోనే పూర్తి విషయాలను వెల్లడిస్తానని అన్నారు. ప్రభాస్ ‘సలార్’ సినిమాలో కీలకపాత్ర వచ్చినా.. అనుకోని పరిస్థితుల వలన చేయలేనని చెప్పానని తెలిపారు. అయితే కరోనా కారణంగా ‘సలార్’ సినిమా షూటింగ్ డేట్స్ విషయంలోనూ మత్పులు జరిగాయని ఇప్పుడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దర్శకుడూ ప్రశాంత్ నీల్ ను కలవబోతున్నట్లు.. అన్నీ కుదిరితే ‘సలార్’ సినిమాలో భాగస్వామినవుతానని అన్నారు.
త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని స్పష్టం చేశారు పృథ్వీరాజ్. తెలుగులో నటించడమే కాకుండా.. దర్శకత్వం చేసే అవకాశం కూడా ఉందని అన్నారు. చాలా మంది కొచ్చి వచ్చి తనను కలుస్తున్నారని.. తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాలని కోరుతున్నారని తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు బిజినెస్ మోడల్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.