అప్పటికి “ఆగడు” సినిమాతో డిజాస్టర్ అందుకొన్న శ్రీనువైట్లకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడమే కాకుండా.. అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన సక్సెస్ ఫుల్ కాంబో శ్రీనువైట్ల-కోన వెంకట్ లను కలిపి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రామ్ చరణ్ నటించిన “బ్రూస్ లీ” రిజల్ట్ ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మొదలుకొని ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసిన చిత్రమది. పాపం నిర్మాత దానయ్య ఆ సినిమాలో కోట్ల రూపాయల నష్టం చవిచూడాల్సి వచ్చింది. అయితే.. ఆ నష్టాలను పూడ్చడానికి రామ్ చరణ్ పూనుకొన్నాడని తెలుస్తోంది.
“సరైనోడు” టైమ్ లోనే బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అల్లు అరవింద్ ప్రకటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాణమవ్వాల్సిన ఈ సినిమాని రామ్ చరణ్ “డివివి క్రియేషన్స్”కు మళ్లించినట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ లో బోయపాటికి ఉన్న క్రేజ్, హీరోను ఆయన తన టేకింగ్ టెక్నిక్స్ తో ఎలివేట్ చేసే విధానం దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను దానయ్య నిర్మిస్తే “బ్రూస్ లీ” నష్టాలు కవర్ అవ్వడంతోపాటు.. మంచి లాభాలు కూడా చవిచూసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ కు వెళుతుందని.. 2018 దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారని వినికిడి.