సినిమాలకు రూ. వందల కోట్లు ఖర్చు పెట్టించడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. అలానే వసూలు చేసుకోవడమూ పెద్ద కష్టం కాదు. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ‘భారతీయుడు 2’ / ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2) . శంకర్ (Shankar) – కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాన్ని చూసింది. దీంతో పెద్ద సినిమాలు కొన్ని కాస్త షేక్ అయ్యాయి అనే చెప్పాలి.
Bharateeyudu
ఆ సంగతి వదిలేస్తే.. ‘ఇండియన్’ సినిమా సీక్వెల్స్ గురించి ఓ నిర్మాత చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’కి కలిపి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టింది అనేది ఆ నిర్మాత కామెంట్స్ సారాంశం. ఈ మాటలు చెప్పింది సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్.
‘ఇండియన్’ సినిమా సీక్వెల్స్ బడ్జెట్ గురించి, సినిమాల నిర్మాణంలో ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. సినిమాలు మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టిందని, మధ్యలో క్రేన్ ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోవడం, బడ్జెట్ హద్దులు దాటిపోవడం లాంటివి జరగడంతో దర్శకుడు శంకర్ మీద ఫిర్యాదు చేయడానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌ను లైకా ప్రొడక్షన్ ఆశ్రయించింది అని చెప్పారు.
ఆ సందర్భంలో ఛాంబర్‌కు అధ్యక్షుడిగా ఉన్న తానే ‘లైకా’ అధినేత సుభాస్కరన్, శంకర్‌తో మాట్లాడి సర్దుబాటు చేశానని చెప్పారు. ముందు అనుకున్న బడ్జెట్‌ను కాకుండా.. రూ.230 కోట్లకు పెంచి దర్శకనిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారని కాట్రగడ్డ తెలిపారు. అయితే ఆ తర్వాత ఇంకో రూ.170 కోట్లు ఇచ్చారని, చివరికి అది ఏకంగా రూ.500 కోట్లు అయింది అని ఆయన తెలిపారు. రెండో పార్టు తేడా కొట్టిన నేపథ్యంలో మూడో పార్టు హిట్ అయితేనే మొత్తం డబ్బులు వస్తాయి. లేదంటే భారీ లాసే.