తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అన్నింటికి చర్చలే పరిష్కారం. దాని కోసం సినిమా చిత్రీకరణలు ఆపేస్తాం అంటూ ఇటీవల యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీ నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. తాజాగా వీటిపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) స్పందించింది. అకస్మాత్తుగా చిత్రీకరణలు ఆపేస్తే కార్మికులతోపాటు, పరిశ్రమలో అందరికీ ఇబ్బందే అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.
టాలీవుడ్‌లో చిత్రీకరణలు ఆపే ప్రసక్తే లేదని, ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే ప్రయత్నిస్తే TFCC తరఫున అడ్డుకుంటామని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులతో ఇప్పటికే సినిమా కార్మికులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలు ఆపేస్తే తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది సినిమా నిర్మాతలు తమ స్వార్థం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతాని విమర్శించారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో అమ్మే ఆహార పదార్థాల ధరలు తగ్గిస్తే మళ్లీ థియేటర్లకి ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని ప్రతాని సూచించారు.
అంతేకానీ ఇలా సినిమా చిత్రీకరణలు ఆపేస్తే సమస్యలు పరిష్కారం కావు అని తెలిపారు. ప్రతాని తరహాలోనే ఇండస్ట్రీలో చాలామంది ఆలోచిస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి చిత్రీకరణలు ఆపాలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి, గిల్డ్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆగస్టు 1 నుండి సినిమా చిత్రీకరణలు ఆపేస్తామని ప్రకటించిన గిల్డ్..
ఆ నిర్ణయంలో ఏమైనా మార్పులు చేస్తుందా? లేక దానికే కట్టుబడి ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ సినిమాలు ఆపితే.. కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగుతాయి అని చెప్పలేం అనే మాటలూ వినిపిస్తున్నాయి. దీనిపై సోమవారం (ఆగస్టు 1) నాడు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.