టాలీవుడ్ నిర్మాతలు సినిమాలకు కలెక్షన్లు తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం రెమ్యునరేషన్ల కోతపై ప్రధానంగా దృష్టి పెట్టారు. హీరో, హీరోయిన్లను రెమ్యునరేషన్లు తగ్గించాలని నిర్మాతలు అడగలేరు. నిర్మాతలు అడిగినా క్రేజ్ ఉన్న హీరోహీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అందువల్ల నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు తగ్గించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులంతా ఇకపై కొత్త పారితోషికాలకే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అందుకు అంగీకరించకపోతే అంగీకరించే వాళ్లను మాత్రమే సినిమాల్లోకి తీసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలలో కోత విధించడం ద్వారా కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో బడ్జెట్ లో తగ్గింపు దక్కుతుందని నిర్మాతలు భావిస్తుండటం గమనార్హం. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలను నిర్మాతలు డైరెక్ట్ గా తగ్గించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుల సిబ్బందికి వాళ్లే జీతాలు ఇచ్చుకోవాలని, సెట్లో ప్రొడక్షన్ పెట్టిన ఫుడ్ మాత్రమే తినాలని నిబంధనలు రాబోతున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా క్యారవాన్ కావాలంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు సొంత ఖర్చులతో తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు పరోక్షంగా తగ్గించడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ఈ నిబంధనలను అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంగీకరిస్తారని లేదు. కొన్ని పాత్రలకు కొందరు నటీనటులు మాత్రమే సూట్ అవుతారనే సంగతి తెలిసిందే. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో నిర్మాతలు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు దృష్టి పెట్టి ఆ విధంగా ఖర్చు తగ్గిస్తే సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాతల నిర్ణయం విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. హీరోయిన్లకు కూడా ఇవే నిబంధనలను అమలులోకి తీసుకొనిరావాలని నిర్మాతలు భావిస్తుండటం గమనార్హం.