సినిమా విడుదలకు తేదీ దగ్గర పడుతుండగా టాలీవుడ్ పెద్ద సినిమాల నిర్మాతల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లకు కావాల్సింది రెండు అంశాలే. ఒకటి టికెట్ రేట్ల పెంపు, మరొకటి షోల పెంపు. నిజానికి ఈ రెండూ చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నవే. ఇండస్ట్రీలో భారీ వసూళ్లకు కారణమై చాలా సినిమాలకు మంచి చేసినవే. అయితే ఇప్పుడు ఈ రెండు అంశాల్లో ఒకటి పెద్ద దెబ్బేస్తోందా? ఏమో జెండా పండగకు వచ్చిన రెండు సినిమాల ఫలితాలు, అంతకుముందు వచ్చిన మరో పెద్ద సినిమా ఫలితం ఇదే చెబుతోంది.
Tickets Rate
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వార్ 2’, ‘కూలీ’ సినిమా భారీ అంచనాలతో వచ్చాయి. ఆ భారీతనం చూసి థియేటర్లలో రేట్లు పెంచేశారు. తెలంగాణలో తమకు అవకాశం ఉన్న మ్యాగ్జిమమ్ ధరలను థియేటర్ల వాళ్లు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చింది. అంతకుముందు వచ్చిన ‘కింగ్డమ్’, ‘హరి హర వీరమల్లు’కి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయం చేశాయి. అయితే ఆ సాయంతో పెరిగిన ధరలు నచ్చక ప్రేక్షకులు సినిమాలను దూరం పెట్టారా? వసూళ్లు అయితే అవుననే అంటున్నాయి.
భారీ వసూళ్లు మనకు రావాలి అంటే.. రేట్లు పెంచుకోవడం కాదు సినిమాలో సత్తా పెంచుకోవడం ముఖ్యమైన మన సినిమా జనాలు అర్థం చేసుకోకపోవడంతో పెట్టేంత రేటుకు తగిన స్టఫ్ సినిమాలో లేదని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఆ విషయాన్నే సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు. ఇవన్నీ చూస్తున్నా మన సినిమాల నిర్మాతలు రేట్ల పెంపు విషయంలో మరో ఆలోచన చేయడం లేదు. సినిమా టికెట్ రేటు పెంచి తొలి వారంతంలో లాగినంత లాగేయడమే అని ఆలోచిస్తున్నారు.
దీంతో మూడు సినిమా చూడకుండా ఉంటే నాలుగో రోజుకు టికెట్ ధరలు తగ్గిపోతాయి అని ఫ్యాన్స్ అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ లోపు పైరసీ బొమ్మ బయటకు వచ్చేసి జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే దీనికి టాలీవుడ్ చెప్పే మాట ‘అంత రేటు నచ్చితేనే సినిమాకు వస్తారు’ అని. ఆ రేటు నచ్చకే రావడం లేదు అని కొందరు అంటున్నారు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్‌లో రెగ్యులర్ టికెట్ రేట్లు తక్కువ అని అంటుంటారు టాలీవుడ్ జనాలు. అలా అయితే ఆ రేట్లు పెంచుకోవాలి కానీ.. రిలీజ్ రేట్లు పెంచుకుంటే ఇబ్బందే మరి. ఈ కార్మికుల బంద్ పూర్తయితే నిర్మాతలు ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.