నటుడు పృథ్వీ (Prudhvi Raj) చేసిన “150 మేకలు, 11 మేకలు” అనే కామెంట్స్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. లైలా (Laila) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతను చేసిన ఈ కామెంట్లు, అనవసరమైన దుమారం రేపాయి. రాజకీయ ప్రస్తావన అవసరం లేకున్నా, ఆయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. #BoycottLaila అనే హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవ్వడం, సినిమా మీద నెగిటివిటీ పెరగడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
పృథ్వీ (Prudhvi Raj) మాత్రం ఈ వ్యతిరేకతను లైట్ తీసుకోలేకపోయాడు. తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన, హైబీపీ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి బెడ్ నుంచే స్పందిస్తూ, “సినిమాను సినిమాగా చూడాలి. మాటల్ని ఇష్టానుసారం వక్రీకరించకండి. నా వ్యక్తిగత జీవితంపై, నా తల్లిని టార్గెట్ చేస్తూ నేరుగా అశ్లీలంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?” అంటూ విమర్శకులపై మండిపడ్డాడు. తనపై సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేయనున్నట్టు వెల్లడించాడు.
ఇక వైసీపీ లీడర్లు మాత్రం ఈ వివాదంపై మరింత కఠినంగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, “మా పార్టీని విమర్శించే నటుల సినిమాలు బహిష్కరించాలి. టికెట్ తీసుకుని మా మీద జోకులు వేయించుకునేంత పిచ్చి మాకులేదు” అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. మరో వైపు, వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కూడా “పృథ్వీ (Prudhvi Raj) ఎవర్నీ ట్రోల్ చేసినా, ఆ సినిమా నిర్మించిన నిర్మాతలు, హీరోలు కూడా బాధ్యత వహించాలి. వీరితో సినిమా చేసే వాళ్లను కూడా బహిష్కరిస్తాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదం మరింత రాజుకుంటున్న నేపథ్యంలో ముందుగానే హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. “ఒకరు పొరపాటు చేస్తే మొత్తం టీమ్ శిక్ష అనుభవించాలా? మా సినిమా కోసం మొత్తం టీమ్ ఎంతో కష్టపడింది. దయచేసి సినిమాను రాజకీయ రంగంలోకి లాగొద్దు” అంటూ విజ్ఞప్తి చేశాడు. లైలా సినిమాపై నెగిటివిటీ క్రియేట్ చేయొద్దని, సినిమాను ప్రేక్షకుల తీర్పుకు వదిలేయాలని కోరాడు. ఇక ఫిబ్రవరి 14న లైలా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ వివాదం బాక్సాఫీస్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
#Laila #PrudhviRaj #VishwakSen pic.twitter.com/fTSPB2QP1Z
— Milagro Movies (@MilagroMovies) February 11, 2025